Haryana Assembly Election : హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఘోర పరాజయంపై పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఒంటరిగా బరిలోకి దిగిన ఆ పార్టీ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోవడంపై కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఎన్నికల్లో అతివిశ్వాసం పనికిరాదని ఈ ఫలితాలు మనకు నేర్పిన పాఠం” అని అన్నారు.
Read Also: KumaraSwamy : సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కుమారస్వామి భేటి
“ఎన్నికలు సమీపిస్తే వాటిని తేలిగ్గా తీసుకోకూడదు. ప్రతి స్థానం, ప్రతి ఎన్నిక కఠినమైనదే. గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి పనిచేయాలి. అంతర్గత పోరు ఉండకూడదు,” అంటూ కేజ్రీవాల్ పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. కేజ్రీవాల్ స్వంత రాష్ట్రం హర్యానాలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఖాతా కూడా తెరవలేకపోవడం గమనార్హం. హర్యానాలో భారతీయ జనతా పార్టీ (BJP) మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా దూసుకుపోతోంది.
ఇండియా కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేయకపోవడం వల్ల ఓట్లు చీలిపోవడంతో బీజేపీ లాభపడింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేసినప్పటికీ, ఆ ఆశలు తలకిందులయ్యాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో, హర్యానా ఫలితాలు ఆప్‌ను మరింత అప్రమత్తంగా ఉంచాయి.