Modi Mother : మోడీ త‌ల్లి హీరాబెన్ కు ఆస్తుల్లేవ్‌, ఆభ‌ర‌ణాల్లేవ్‌.!

`అమ్మ(Modi Mother) పేరుతో ఆస్తులు లేవు. బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదు.

  • Written By:
  • Publish Date - December 30, 2022 / 01:18 PM IST

`అమ్మ(Modi Mother) పేరుతో ఎటువంటి ఆస్తులు లేవు. బంగారు ఆభరణాలు ఆమె ధరించింది తాను చూడలేదు. ఆమెకు ఆసక్తి కూడా ఉండేది కాదు. గతంలో మాదిరి అతి సాధారణ జీవితాన్ని, ఒక చిన్న గదిలో కొనసాగిస్తున్నారు. అమ్మతో కలిసి బయటకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ‌. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో అమ్మ హీరాబెన్(Modi Mother) త‌న వెంట ఉంది. వర్షానికి ఇల్లంతా ఉరిసేది. వర్షం నీరు పడుతున్న చోట బకెట్లు, గిన్నెలు పెట్టేది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా, ఎంతో దృఢంగా నిలబ‌డింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంది…` అంటూ ఎన్నో చిన్ననాటి జ్ఞ‌ప‌కాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ త‌న సొంత బ్లాగు(blog)లో త‌ల్లి హీరాబెన్ గురించి పంచుకున్నారు.

మోడీ త‌ల్లి హీరాబెన్ మృతి(Modi Mother)

అమ్మ‌ను మించిన దైవం లేదంటారు. ఢిల్లీకి రాజైనా ఒక అమ్మ‌కు కొడుకే క‌దా. శివుని పాదాల వ‌ద్ద‌కు త‌ల్లి చేరింద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ భావోద్వేగానికి లోన‌య్యారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు చంద్ర‌బాబునాయుడు, దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు ఆయ‌న‌కు సానుభూతి తెలిపారు. దేశ వ్యాప్తంగా మోడీ త‌ల్లి హీరాబెన్ మృతి సంద‌ర్భంగా త‌ల్లీ, కుమారుడి మ‌ధ్య ఉన్న అనుబంధం తెలుసుకోవ‌డానికి రికార్డ్ స్థాయిలో గుగూల్ సెర్చ్ చేశారు.

వంద సంవత్సరాల పుట్టిన రోజు వేడుక సందర్భంగా త‌ల్లి హీరాబెన్ గురించి మోడీ ఆవిష్క‌రించిన మనస్సులోని భావాలను ఎక్కువ‌గా చ‌దివారు. `అమ్మ అన్నది ఒక పదం కాదు.. ఎన్నో భావోద్వేగాల సంగ్రహం..` అంటూ ఆయ‌న పేర్కొన్నారు. తన తల్లి నూరవ పుట్టిన రోజు సందర్భంగా తల్లికి కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేస్తూ తన మనసులోని ఆలోచనలను ప్రధాని మోడీ తన బ్లాగ్ లో రాసుకున్నారు. అమ్మ సాధారణంగా కనిపించినప్పటికీ ఆమె అసాధారణమైన మహిళ అని, చాలా చిన్న వయసులోనే తన తల్లి ఆమె మాతృమూర్తిని కోల్పోయిందని, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిందని, అయినప్పటికీ బలంగా నిలబడిందని పేర్కొన్నారు.

Also Read : PM Modi: తల్లి పాడే మోసిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

తన పెరుగుదల కోసం , ఎదుగుదల కోసం తల్లి ఎన్నో త్యాగాలను చేసిందని మోడీ వెల్లడించారు. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ప్రేరణ నిచ్చింది తన తల్లేనని తెలిపారు. తాను చిన్నప్పుడు తల్లి పడిన కష్టాలని, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న మోడీ ఆమె ప‌డిన క‌ష్టాల‌ను బ్లాగ్ లో రాసుకున్నారు. అమ్మ ఇంట్లో పనులన్నీ తాను ఒక్కతే చేసుకునేదని, ఇంటి పోషణ కోసం కూడా తమ వంతు కష్టపడేది అని, వేరే వాళ్ల ఇళ్లల్లో వంటపాత్రలు కడిగి, చరఖా తిప్పి వచ్చిన ఆదాయంతో కుటుంబ ఖర్చులకు మద్దతుగా నిలిచేదని మోడీ త‌న బ్లాగు(blog)లో పంచుకున్న జ్ఞాప‌కాలు మ‌రిచిపోలేనివి.

గాంధీనగర్ లోని శ్మశానవాటికలో అంత్యక్రియ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అర్ధరాత్రి కన్నుమూశారు. ఆమె వయస్సు 100 సంవత్సరాలు. శ్వాస సంబంధిత ఇబ్బందులతో ఆమె ఇటీవలే అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్స తీసుకుంటోన్న సమయంలో ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ- ఆ తరువాత విషమించింది. డాక్టర్లు అత్యాధునిక వైద్య చికిత్సను అందించినప్పటికీ ఫలితం లేకపోయింది.

తల్లి మరణవార్త తెలిసిన వెంటనే మోదీ గాంధీనగర్ కు చేరుకున్నారు. ఆసుపత్రి నుంచి పార్థివ దేహాన్ని గాంధీనగర్ లోని రైసాన్ నివాసానికి తరలించారు. నివాళి అర్పించిన అనంతరం అంత్యక్రియలను చేపట్టారు. స్వయంగా తల్లి పాడెను మోశారు మోదీ. గాంధీనగర్ లోని శ్మశానవాటికలో చితికి నిప్పంటించారు. మోదీ సోదరుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, మాజీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ, కేబినెట్ మంత్రులు, అతి కొద్దిమంది సన్నిహితులు హీరాబెన్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Also Read : PM Modi mother passes away: ప్రధాని మోదీకి మాతృవియోగం