Vande Mataram: జాతీయ గీతం ‘జన గణ మన’కు ఉన్న గౌరవప్రదమైన స్థానాన్ని జాతీయ గేయం ‘వందేమాతరం’కు కూడా కల్పిస్తూ భారత ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జనవరి 28న విడుదల చేసిన 10 పేజీల కొత్త ఉత్తర్వుల ప్రకారం.. ఇకపై బహిరంగ కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ పాడటం, ప్లే చేయడం తప్పనిసరి.
3.10 నిమిషాల నిడివి
కొత్త నిబంధనల ప్రకారం.. ఇకపై కేవలం ప్రారంభ పంక్తులు మాత్రమే కాకుండా ఈ గేయంలోని ఆరు చరణాలతో కూడిన సుదీర్ఘ వెర్షన్‌ను ప్లే చేస్తారు. దీని మొత్తం నిడివి 3 నిమిషాల 10 సెకన్లుగా నిర్ణయించారు. ఈ ఆదేశాల ప్రతులను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, మంత్రిత్వ శాఖలకు పంపారు.
ఎప్పుడు, ఎక్కడ తప్పనిసరి?
- హోం శాఖ ఆదేశాల ప్రకారం ఈ క్రింది సందర్భాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరిగా ప్లే చేయాలి.
- త్రివర్ణ పతాకాన్ని (జాతీయ జెండా) ఎగురవేసే సమయంలో.
- రాష్ట్రపతి, గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌లు ఏదైనా కార్యక్రమానికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు.
- రాష్ట్రపతి ‘జాతిని ఉద్దేశించి ప్రసంగించే’ ముందు, ప్రసంగం ముగిసిన తర్వాత.
- ఏదైనా కార్యక్రమంలో జాతీయ గీతం (జన గణ మన), జాతీయ గేయం (వందేమాతరం) రెండూ నిర్వహించాల్సి వస్తే.. మొదట ‘వందేమాతరం’ ప్లే చేయాలి. ఆ తర్వాతే ‘జన గణ మన’ వస్తుంది.
Also Read: మైసూర్ శాండల్ సోప్ బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నా.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?!
గౌరవ సూచక నియమాలు
‘వందేమాతరం’ అధికారిక వెర్షన్‌ను పాడినా లేదా ప్లే చేసినా అక్కడ ఉన్న వారందరూ తప్పనిసరిగా ‘సావధాన్’ స్థితిలో నిలబడి గౌరవించాలి. గేయం పట్ల గౌరవాన్ని చాటిచెప్పడానికి ఈ నిబంధనను అమలులోకి తెచ్చారు.
మినహాయింపులు ఎక్కడ?
ప్రోటోకాల్‌లో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చారు. ఒకవేళ ‘వందేమాతరం’ ఏదైనా న్యూస్ రీల్, డాక్యుమెంటరీ లేదా సినిమా కథలో భాగంగా ఉంటే ప్రేక్షకులు నిలబడాల్సిన అవసరం లేదు. బహిరంగ ప్రదేశాల్లో (ఉదాహరణకు సినిమా హాళ్లలో) గందరగోళం లేదా అశాంతి కలగకుండా ఉండటానికి ఈ వెసులుబాటు కల్పించారు.
మొదటిసారి అధికారిక ప్రోటోకాల్
ఇప్పటివరకు జాతీయ గీతం ‘జన గణ మన’కు 52 సెకన్ల సమయం, కచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. కానీ ‘వందేమాతరం’కు సంబంధించి ఎటువంటి స్పష్టమైన రాతపూర్వక ప్రోటోకాల్ లేదు. జాతీయ గేయం గాన నిడివిని, చరణాల సంఖ్యను, నిలబడాల్సిన నిబంధనలను ప్రభుత్వం అధికారికంగా క్రోడీకరించడం ఇదే మొదటిసారి.
