Parliament : భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్‌లో రాజ్యాంగం ప్రత్యేక చర్చ జరుగుతోంది. ఈ రోజు చర్చలో పాల్గొన్న రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. బీజేపీ తీరును, ఆ పార్టీ ముఖ్య నేతల తీరును తప్పుపట్టారు. బీజేపీలో చేరగానే అవినీతిపరులు నీతిమంతులుగా మారుతారని విమర్శలు చేశారు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న నాయకులపై అవినీతి ముద్రవేసి, వాళ్లు బీజేపీలో చేరగానే నీతిమంతులుగా బీజేపీ చెబుతుండటాన్ని ఖర్గే ఎగతాళి చేశారు.
దేశంలో ఎన్నికలు ఎక్కడుంటే అక్కడికే ప్రధాని మోడీ వెళ్తారు. కానీ మణిపూర్‌కు వెళ్లేందుకు మాత్రం అతను ఇష్టపడటం లేదు అంటూ విమర్శించారు. మిమ్మల్ని కేవలం ఒక రాష్ట్రమో, ప్రాంతమో ఓటేయలేదు. మీరు ఇతర ప్రాంతాలపై ప్రతీకారం తీర్చుకోవడం తగదు అని మండిపడ్డారు. ప్రధానికి కావాల్సినంత భద్రత ఉంటుందని, అయినా ప్రధాని మాత్రం మణిపూర్‌కు వెళ్లేందుకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇన్నిరోజులవుతున్నా మణిపూర్‌లో పరిస్థితి మీరు ఎందుకు చక్కదిద్దడం లేదని ప్రభుత్వాన్ని ఖర్గే ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మణిపూర్‌కు వెళ్లారని, అంతేగాక అక్కడ యాత్ర చేశారని మల్లికార్జున్ ఖర్గే గుర్తుచేశారు. కాగా, పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సోమవారం రాజ్యసభలో భారత రాజ్యాంగంపై అధికార, ప్రతిపక్షాల మధ్య వాడి వేడి చర్చ జరిగింది. ఇప్పటికే ఈ నెల 13, 14 తేదీల్లో లోక్‌సభలో చర్చ పూర్తయ్యింది.