Women’s Reservation Bill: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ (131వ) బిల్లు 54 ఓట్ల తేడాతో వీగిపోయింది. దీనితో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. బిల్లును ఆమోదించడానికి సభలో ఉన్న 528 మంది ఎంపీలు ఓటు వేయగా, బిల్లుకు అనుకూలంగా కేవలం 298 ఓట్లు మాత్రమే పడ్డాయి. వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. బిల్లు ఆమోదం పొందాలంటే 352 ఓట్ల మెజారిటీ అవసరం. కానీ ఆ మెజారిటీ రాకపోవడంతో బిల్లు వీగిపోయింది.
నిలిచిపోయిన మరో 2 బిల్లులు
ఈ బిల్లు ఫెయిల్ కావడంతో దీనికి అనుబంధంగా ఉన్న మరో రెండు బిల్లులైన ‘నియోజకవర్గాల పునర్విభజన (సవరణ) రాజ్యాంగ బిల్లు 2026’, ‘కేంద్రపాలిత ప్రాంతాల చట్టం (సవరణ) బిల్లు 2026’లను ప్రభుత్వం ఓటింగ్ కోసం ప్రవేశపెట్టలేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్‌సభలో ఈ బిల్లు వీగిపోవడం అంటే అర్థం ఏమిటి? నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అమలు చేయగలదా? ప్రభుత్వం ముందున్న తదుపరి మార్గాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి సమావేశాన్ని పిలవలేదు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 108 ప్రకారం రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉమ్మడి సమావేశాన్ని పిలిచే అవకాశం లేదు. ఎందుకంటే ఉమ్మడి సమావేశం అనేది కేవలం సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య ఏకాభిప్రాయం కుదరనప్పుడు మాత్రమే నిర్వహిస్తారు. రాజ్యాంగ సవరణ బిల్లులకు ఉమ్మడి సమావేశం నిబంధన వర్తించదు. ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే పార్లమెంటులోని రెండు సభల్లోనూ ప్రత్యేక మెజారిటీ తప్పనిసరి.
పునర్విభజనతోనే రిజర్వేషన్లు సాధ్యం
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం మహిళా రిజర్వేషన్లపై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే ఈ బిల్లులో పార్లమెంటు స్థానాలను 543 నుండి 850కి పెంచే నిబంధన ఉంది. దీనితో నియోజకవర్గాల పునర్విభజన బిల్లు ముడిపడి ఉంది. సాధారణంగా పునర్విభజన అనేది తాజా జనగణన ఆధారంగా జరుగుతుంది. కానీ ఈ బిల్లులో 2011 జనగణన ఆధారంగా పునర్విభజన చేయాలని ప్రతిపాదించారు. పునర్విభజన జరగకుండా సీట్లు పెరగవు. సీట్లు పెరగకుండా మహిళా రిజర్వేషన్లు అమలు కావు.
Also Read: Prakash Raj: ప్రకాశ్ రాజ్‌పై పరువు నష్టం దావా
బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వం ముందున్న మార్గాలు
ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించుకోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి. అయితే అందుకు సమయం మరియు ఏకాభిప్రాయం అవసరం. కేంద్ర ప్రభుత్వం తదుపరి వర్షాకాల సమావేశాల్లో లేదా బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును మళ్లీ లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టవచ్చు. ప్రతిపక్షాల డిమాండ్లు, సూచనలు, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా బిల్లులో మార్పులు చేసి మళ్లీ తీసుకురావచ్చు. లోక్‌సభలో ఫెయిల్ అయిన ఈ బిల్లు కోసం ప్రభుత్వం రాజ్యసభలో కూడా ప్రత్యేక మెజారిటీని కూడగట్టాల్సి ఉంటుంది.
ఒకవేళ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోతే 2029 లోక్‌సభ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే జరుగుతాయి. పునర్విభజన ప్రక్రియ చేపట్టడం సాధ్యం కాదు కాబట్టి. మహిళా రిజర్వేషన్ల అమలు వాయిదా పడుతుంది. పునర్విభజన జరిగితే పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల బలం తగ్గుతుందని, ఇది OBC-SC-ST వర్గాలకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.
