Aadhaar Voter Card Seeding : ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు అనుసంధానంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారమే ఓటర్ ఐడీతో ఆధార్‌ను(Aadhaar Voter Card Seeding) లింక్ చేస్తున్నట్లు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 23(4), 23(5), 23(6) సెక్షన్లు, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారమే ఈ ప్రక్రియను చేపడుతున్నట్లు ఈసీ తెలిపింది. ఓటర్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేయడంతో ముడిపడిన సాంకేతిక అంశాలపై త్వరలోనే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI), ఈసీలకు చెందిన నిపుణులు సంప్రదింపులు జరుపుతారని ఎన్నికల సంఘం చెప్పింది. ఇదే అంశంపై చర్చించేందుకు ఇవాళ ఈసీ ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో కేంద్ర హోంశాఖ, న్యాయశాఖ, ఐటీ శాఖల కార్యదర్శులు, యూఐడీఏఐ సీఈఓ పాల్గొన్నారు.
Also Read :China Army In Pak: పాకిస్తాన్ గడ్డపైకి చైనా ఆర్మీ.. కారణం ఇదే
నకిలీ ఓటర్ల సమస్యకు అడ్డుకట్ట
ఓటరు ఐడీతో ఆధార్ కార్డును లింక్ చేస్తే నకిలీ ఓటర్ల సమస్యకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు. దీనివల్ల ఓటింగ్ సరళిలో పారదర్శకత మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలు, రిగ్గింగ్ జరిగే ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియలో విశ్వసనీయతను పెంచే దిశగా ఈ చర్యలు దోహదపడతాయని పరిశీలకులు అంటున్నారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం వల్ల వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ చేతుల్లోకి వెళ్లే ముప్పు ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీ-ఆధార్ లింక్ ప్రక్రియ ఎలా పూర్తవుతుంది ? పూర్తయ్యాక ఏం చేస్తారు ? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నికల సంస్కరణలను వేగవంతంగా అమలు చేస్తున్నారు. జిల్లాల స్థాయిలో ఎలక్టోరల్ అధికారులతోనూ త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని ఆయన గతంలోనూ ప్రకటించారు.