Google : టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలిచిన గూగుల్ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై దృష్టిపెడుతున్న సందర్భంలో, వ్యూహాత్మకంగా కంపెనీ పునర్‌వ్యవస్థీకరణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ పరిధిలోని సేల్స్, పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ‘ది ఇన్ఫర్మేషన్’ అనే ప్రఖ్యాత మీడియా సంస్థ ఈ విషయాన్ని గూగుల్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా వెల్లడించింది.
Read Also: Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్ సింగ్
ఇది తక్కువ వ్యయంతో మరింత సమర్థవంతమైన సేవలను వినియోగదారులకు అందించేందుకు చేసిన చర్యగా గూగుల్ పేర్కొంది. గత నెలలోనే గూగుల్ ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి కావడం విశేషం. అప్పట్లో కంపెనీ తమ ప్లాట్‌ఫామ్, డివైజ్ యూనిట్లలో పని చేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించింది. ముఖ్యంగా ఆండ్రాయిడ్, పిక్సెల్, క్రోమ్ విభాగాల్లో పని చేస్తున్న వారు ఈ ప్రభావానికి లోనయ్యారు.
గత రెండు సంవత్సరాలుగా గూగుల్ పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. 2023 డిసెంబరులో సంస్థ తన మేనేజ్మెంట్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని తొలగించింది. 2024 ఫిబ్రవరిలో HR మరియు క్లౌడ్ విభాగాల్లోని కొంతమంది ఉద్యోగులను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ చర్యలు ఖర్చుల నియంత్రణను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవిగా చెబుతున్నది.
2022లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థలో 20 శాతం మంది మరింత సమర్థవంతంగా పని చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అదే ఏడాది కంపెనీ 12,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. ఈ నేపథ్యంలో ఓపెన్‌ఏఐ లాంటి సంస్థల నుంచి సెర్చ్ రంగంలో వస్తున్న పోటీతో గూగుల్‌పై ఒత్తిడి పెరుగుతోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇంతలో అమెరికాలో విదేశీ ఉద్యోగులకు ట్రంప్ విధిస్తున్న కఠిన నియమాలు కూడా గూగుల్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also : Who is Sajid Mir : సాజిద్ మీర్ ఎవరు ? పాకిస్తానే చంపింది.. బతికించింది !!