Journalist Murder Case : ఛత్తీస్‌గఢ్‌లో జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్ దారుణ హత్య ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఈ హత్య కేసులో కీలక నిందితుడు సురేశ్ చంద్రకర్ మన హైదరాబాద్‌లోనే ఆదివారం రాత్రి అరెస్టు అయ్యాడు. నిందితుడి ఇంటి పేరును చూస్తే.. అర్ధమయ్యే ఉంటుంది. సురేశ్‌కు కూడా చంద్రకర్ అనే ఇంటిపేరే ఉంది. ఎందుకంటే హత్యకు గురైన జర్నలిస్ట్ ముకేశ్ చంద్రకర్‌కు ఇతగాడు సమీప బంధువే. ముకేశ్ చంద్రకర్ డెడ్‌బాడీ ఒక కాంట్రాక్టరుకు చెందిన స్థలంలో ఉన్న సెప్టిక్ ట్యాంకులో దొరికింది. ఆ కాంట్రాక్టరు కూడా ముకేశ్‌కు సమీప బంధువే అని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో మాస్టర్ మైండ్‌గా సురేశ్ చంద్రకర్ వ్యవహరించాడని తెలిపారు. ప్రస్తుతం అతడిని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముకేశ్ చంద్రకర్ డెడ్‌బాడీ(Journalist Murder Case) దొరికినప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో సురేశ్ చంద్రకర్‌పై అనుమానం వచ్చి దర్యాప్తు చేస్తున్నామని ఛత్తీస్‌గఢ్ పోలీసు వర్గాలు చెప్పాయి. అతగాడు హైదరాబాద్‌లో ఉన్న తన డ్రైవరు ఇంట్లో ఉండగా పోలీసులు అరెస్టు చేశారు. సురేశ్ ఆచూకీని గుర్తించే క్రమంలో ఛత్తీస్‌గఢ్ పోలీసుల సూచన మేరకు హైదరాబాద్ నగర పోలీసులు దాదాపు 200 సీసీటీవీ కెమెరా ఫుటేజీలను జల్లెడ పట్టారు. దాదాపు 300 ఫోన్ నంబర్ల లొకేషన్లను ట్రేస్ చేశారు. సురేశ్‌కు చెందిన బ్యాంకు అకౌంట్లను సీజ్ చేశారు. అతడు ఛత్తీస్‌గఢ్‌లో అక్రమంగా నిర్మిస్తున్న యార్డును ధ్వంసం చేశారు. సురేశ్ భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు సురేశ్ సహా మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు. వీరిలో రితీష్, దినేశ్‌లు కూడా మృతుడికి బంధువులే.
Also Read :Dil Raju : ‘వకీల్ సాబ్’ను పవన్ కల్యాణ్ గుర్తు చేయగానే కన్నీళ్లు వచ్చాయి : దిల్ రాజు
హత్య ఇలా జరిగింది..
ఛత్తీస్‌గఢ్‌లోని గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులలో అవినీతి జరిగిందంటూ ముకేశ్ చంద్రకర్ మీడియాలో కథనాలను రాశాడు. తొలుత రూ.50 కోట్ల టెండర్‌తో చేపట్టిన ఈ ప్రాజెక్టు, అభివృద్ధి పనులన్నీ జరగకముందే రూ.120 కోట్లకు చేరుకుందని కథనంలో ప్రస్తావించాడు. జర్నలిస్టు ముకేశ్‌కు వరుసకు సోదరుడయ్యే రితీశ్, సూపర్‌వైజర్ మహేంద్రతో భోజనం చేసే సమయంలో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిద్దరూ ఇనుప రాడ్డుతో ముకేశ్‌పై ఎటాక్ చేశారు. దీంతో అతడు చనిపోయాడు. ఆ తర్వాత మహేంద్ర దగ్గరుండి ముకేశ్ డెడ్‌బాడీని సెప్టిక్ ట్యాంక్‌లో వేయించాడు. దాన్ని సిమెంట్‌తో మూసివేయించాడు. ఈ హత్యకు సురేశ్‌ను మాస్టర్‌మైండ్‌గా భావిస్తున్నారు.
Also Read :Aadhaar Card Loan : ఆధార్ కార్డు ఉంటే చాలు లోన్.. ‘పీఎం స్వనిధి’కి అప్లై చేసేయండి
హత్య చేసిన తర్వాత..
ముకేశ్‌ను హత్య చేసిన తర్వాత అతడి గుండెను చీల్చి బయటకు తీసినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అతడి లివర్‌ను నాలుగు ముక్కలు చేశారని తేలింది. ముకేశ్ పక్కటెముకలు ఐదు చోట్ల విరిగాయి. తలపై 15 చోట్ల ఎముకలు విరిగాయి. దారుణంగా అతడి కట్టేసి కొట్టడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు. తమ 12 ఏళ్ల కెరీర్‌లో ఇంత భయానక హత్యను ఎన్నడూ చూడలేదని డాక్టర్లు తెలిపారు.