Terror Attack: జమ్మూకశ్మీర్‌లో జరిగిన భీకర ఉగ్రదాడిలో చనిపోయిన పర్యాటకుల సంఖ్య మరింత పెరిగింది. తాజా సమాచారం ప్రకారం.. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటివరకు 27 మంది టూరిస్టులు చనిపోయారు. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం 3 గంటలకు పహల్గాం పరిధిలోని బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు 40 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అకస్మాత్తుగా చుట్టుముట్టారు. అనంతరం వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో కొంతమంది అక్కడికక్కడే చనిపోయారు. అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు. సంఘటనా స్థలంలో రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది. తమ వారిని కాపాడాలంటూ పలువురు రిక్వెస్టు చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. టూరిస్టులను ఉగ్రవాదులు చుట్టుముట్టిన ప్రాంతం అనేది అడవుల మధ్యన ఉంటుంది. అక్కడికి సరైన రోడ్లు లేవు. ఆ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే వెళ్లే వీలుంటుంది. అందువల్ల గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించడంలో బాగా జాప్యం జరిగింది. ఫలితంగా ఎంతోమంది టూరిస్టులు మార్గం మధ్యలోనే ప్రాణాలు విడిచారు.
Also Read :Chinas New Weapon: చైనా కొత్త బాంబు.. దడ పుట్టించే నిజాలు
కాల్పుల శబ్దం వినిపించగానే..
బైసరన్‌లో కాల్పుల శబ్దం వినిపించగానే భారత భద్రతా బలగాలు(Terror Attack) అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. స్థానిక ప్రజలు గుర్రాల సాయంతో పలువురిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత పహల్గాంలోని వీధులు నిర్మానుష్యంగా మారాయి. అక్కడి నుంచి పర్యాటకులను ఇతర ప్రాంతాలకు తరలించారు. అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి ఆందోళన రేకెత్తించేలా ఉంది.
Also Read :Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి విచారణ పూర్తి.. ఏం అడిగారు ? ఏం చెప్పాడు ?
అమర్‌నాథ్ యాత్ర కోసం..
అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులు వెళ్లేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. అనంత్ నాగ్ జిల్లా మీదుగా అమర్‌నాథ్‌కు చేరాలంటే పహల్గాం మార్గంలో 48 కిమీ మేర ప్రయాణించాల్సి ఉంటుంది. గండేర్బల్ జిల్లా మీదుగా 14కి.మీ ప్రయాణిస్తే అమర్ నాథ్‌కు చేరుకోవచ్చు. పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తైబాకు అనుబంధంగా కశ్మీర్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ‘ది రెసిస్టన్స్ ఫ్రంట్’ (TRF) ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో దాదాపు ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొన్నట్లు గుర్తించారు.