Jammu Kashmir : జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ ఇవాళ ఉదయాన్నే ప్రారంభమైంది. పోలింగ్ జరుగుతున్న మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకుగానూ 24 జమ్మూ ప్రాంతంలో(Jammu Kashmir), 16 కశ్మీర్ లోయలో ఉన్నాయి. 5,060 పోలింగ్ కేంద్రాల్లో 39.18 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 415 మంది అభ్యర్థులు ఈ విడతలో పోటీ చేస్తున్నారు. తొలిసారిగా కశ్మీరులో ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారు.
Also Read :Rajinikanth: కడుపు నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరిన రజనీకాంత్
ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత జరగుతున్న తొలి ఎన్నికలు ఇవే. ఈ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కాంగ్రెస్ చేతులు కలిపింది. బీజేపీ, పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీడీపీ) ఒంటరిగా పోటీ చేస్తున్నాయి.జమ్మూ కశ్మీర్‌లో సెప్టెంబర్ 18న తొలి విడత ఎన్నికలు జరగగా 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. సెప్టెంబర్ 25న రెండో విడత పోలింగ్ జరగగా, 50 శాతం పోలింగ్ నమోదైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న వెలువడనున్నాయి.
Also Read :Arvind Dharmapuri : కేసీఆర్ మాటలు మిస్సవుతున్నా..ఎంపీ అర్వింద్
ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారి..
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ వేళ కీలక నియామకం జరిగింది. 1992 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి నళిన్ ప్రభాత్‌ను జమ్మూ కశ్మీర్ డీజీపీగా నియమించారు. ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కశ్మీర్ డీజీపీ ఆర్.ఆర్. స్వైన్ పదవీ విరమణ చేశారు. దీంతో ఆయన స్థానంలో నళిన్ ప్రభాత్‌ను నియమించారు. ఇంతకుముందు ఎన్‌ఎస్‌జీ డైరెక్టర్ జనరల్‌గా నళిన్ ప్రభాత్ వ్యవహరించారు. వాస్తవానికి జమ్మూ కశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్‌ను నియమిస్తూ కేంద్ర హోం శాఖ ఆగస్టు నెలలోనే ఉత్తర్వులు ఇచ్చింది. నళిన్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనూ పోలీసుశాఖ తరఫున సేవలు అందించారు. అందుకే కీలకమైన కశ్మీర్ డీజీపీ పోస్టుకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.