India Vs Pakistan : ఓ వైపు మన దేశవ్యాప్తంగా హై అలర్ట్ ఉండగా.. మరోవైపు బార్డర్‌లో ఉద్రిక్తత నెలకొంది. భారత సేనలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సక్సెస్ కావడాన్ని ఓర్వలేక పాకిస్తాన్ సేనలు రెచ్చిపోతున్నాయి. బార్డర్‌లో ఉన్న పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఎడతెరిపి లేకుండా ఫైరింగ్ చేస్తున్నారు. సరిహద్దులోని గ్రామాలపైకి కూడా ఫైరింగ్ చేస్తున్నారు. ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులో పహల్గాం ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ఆర్మీ ఇదే విధంగా దారుణంగా కాల్పులకు తెగబడుతోంది. భారత సేనలను కవ్విస్తోంది.
Also Read :Sindoor : సిందూరానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలుసా ?
అమరుడైన లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్
తాజా అప్‌డేట్ ఏమిటంటే.. బుధవారం అర్ధరాత్రి నుంచి పూంచ్, కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్, కర్నాహ్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపైకి పాక్ ఆర్మీ(India Vs Pakistan) మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్‌కు పాల్పడుతోంది. ఈ కాల్పులను భారత సైన్యం ఎప్పటికప్పుడు బలంగా తిప్పికొడుతోంది. ఈ పరిస్థితుల్లో సదరు గ్రామాల సామాన్య ప్రజలు హడలిపోతున్నారు. కొందరైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో లాన్స్ నాయక్ దినేశ్‌కుమార్ అనే భారత జవాను అమరులు అయ్యారు. ఆయన ఆర్మీలోని 5వ ఫీల్డ్ రెజిమెంట్‌లో సేవలు అందించేవారు. ఆయన అమరత్వం పొందారని వైట్ నైట్ కోర్ విభాగం ప్రకటించింది.
ప్రాణాలు కోల్పోయిన 15 మంది సామాన్యులు
మంగళవారం అర్ధరాత్రి నుంచి సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల్లో చనిపోయిన భారత పౌరుల సంఖ్య 15కు పెరిగింది. మరణించిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది. 57 మంది సామాన్య ప్రజలు గాయపడ్డారని భారత ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్ కాల్పుల్లో సామాన్య ప్రజల మరణాలు అత్యధికంగా పూంచ్ సెక్టార్‌లో సంభవించాయి. భారత్ – పాకిస్తాన్ 3,323 కిలో మీటర్ల మేర సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇందులో అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూలోని అఖ్నూర్ వరకు దాదాపు 2,400 కిలో మీటర్లు ఉంటుంది.. జమ్మూ నుంచి లఢక్ రాజధాని లేహ్ వరకు 740 కిలో మీటర్ల మేర నియంత్రణ రేఖ ఉంటుంది. సియాచిన్ ప్రాంతంలో 110 కిలోమీటర్ల యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ ఉంటుంది.
Also Read :Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9
పహల్గాం ఉగ్రదాడి ముష్కరుల కోసం వేట
ఇక పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నాయి. ఏప్రిల్ 22 నుంచి ఇప్పటివరకు 100కుపైగా అనుమానిత ఉగ్రవాదులు, వారి అనుచరుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు. బుధవారం ఒక్కరోజే 30కి పైగా ప్రాంతాల్లో సోదాలు జరిపారు, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.