Cloud Kitchen : రైళ్లలోని బేస్ కిచెన్‌ల గురించి మనకు బాగా తెలుసు. వాటిలో వంటకాలు, ఫుడ్ ఐటమ్స్‌ను తయారు చేసి ప్రయాణికులకు విక్రయించేవారు. ఇకపై రైళ్లలోని బేస్ కిచెన్లు మూతపడనున్నాయి. వాటి స్థానంలో విడతలవారీగా అన్ని రైళ్లలో క్లౌడ్ కిచెన్లను అందుబాటులోకి తేవడంపై రైల్వేశాఖ ఫోకస్ పెట్టింది. రైళ్లలో ప్రయాణించే ప్రజల ఆరోగ్య భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రైల్వేశాఖకు చెందిన ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. క్లౌడ్ కిచెన్ల(Cloud Kitchen) ద్వారా మరింత నాణ్యమైన ఆహార ఉత్పత్తులను ప్రయాణికులకు అందిస్తామని తెలిపింది.
Also Read :Ola Showroom On Fire : ఓలా స్కూటర్ పనిచేయడం లేదని.. ఓలా షోరూంకు నిప్పుపెట్టిన యువకుడు
రైల్వేశాఖలో క్లౌడ్ కిచెన్ల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ తొలుత మహారాష్ట్రలో మొదలైంది. ముంబై నగరంలోని కొన్ని రైల్వే స్టేషన్ల పరిధిలో ఇప్పటికే 50 క్లౌడ్ కిచెన్లను ప్రారంభించారు. త్వరలోనే మహారాష్ట్రలోని పోవై, కుర్లా, పన్వెల్, థానే, చెంబూర్‌లలో క్లౌడ్ కిచెన్ సేవలు మొదలవుతాయి. మహారాష్ట్రలో 90 క్లౌడ్ కిచెన్లు ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి. రాబోయే మూడు నెలల్లో మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల పరిధిలో దాదాపు 200 క్లౌడ్ కిచెన్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. క్లౌడ్ కిచెన్ల ఏర్పాటు ప్రక్రియ మొదలైన తర్వాత ఆయా ఏరియాల్లో ఆహార నాణ్యత విషయమై రైల్వే ప్రయాణికుల నుంచి వచ్చే కంప్లయింట్ల సంఖ్య తగ్గిందని అధికార వర్గాలు చెప్పాయి.
Also Read :Tremors In Delhi: పాక్‌లో భూకంపం.. భారత్‌లోని ఆరు రాష్ట్రాల్లో ప్రకంపనలు
క్లౌడ్ కిచెన్ల నిర్వహణ బాధ్యతలను పాకశాస్త్ర నిపుణులు, కేటరింగ్ సంస్థలకు ఐఆర్‌సీటీసీ ఒప్పంద ప్రాతిపదికన అప్పగించనుందని సమాచారం. వంట గదిలో సీసీటీవీని ఏర్పాటుచేస్తారు. ఆహార పరిశుభ్రతను నిశితంగా పరిశీలిస్తారు. టిఫిన్, లంచ్, డిన్నర్ కోసం రోజూ ఈ క్లౌడ్ కిచెన్లు వంటకాలను రెడీ చేస్తాయి. ఆయా ఏరియాల్లో రైల్వే ప్రయాణికుల నుంచి ఉండే డిమాండ్ ఆధారంగా వంటకాలను అందుబాటులోకి తెస్తాయి. క్లౌడ్ కిచెన్లను నడుపుతున్న సంస్థలు రైళ్లలోని కోల్డ్ స్టోరేజీ వ్యాన్ ద్వారా సుదూర రైళ్ల ప్యాంట్రీ కార్లకు ఆహారాన్ని డెలివరీ చేస్తాయని తెలుస్తోంది.