Terrorists Hunt : పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల కోసం భారత భద్రతా బలగాల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను భారత సైన్యం నాలుగుసార్లు ట్రాక్ చేసింది. దక్షిణ కశ్మీర్‌లోని అడవుల్లో వాళ్లు నక్కి ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి భద్రతా బలగాలు చేరుకున్నప్పటికీ.. కొద్దిపాటి వ్యవధిలో ముష్కర మూకలు తప్పించుకోగలిగారు. కూంబింగ్ జరుపుతున్న క్రమంలో ఒకసారి భద్రతా దళాలు, ఉగ్రవాదుల(Terrorists Hunt) మధ్య ఫైరింగ్ కూడా జరిగిందని తెలిసింది. కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులకు అత్యంత దగ్గరగా భారత భద్రతా బలగాలు వెళ్లాయని సమాచారం. కశ్మీరులోని స్థానికులు, ఇంటెలీజెన్స్ సిబ్బంది ఇస్తున్న సమాచారం వల్లే ఈ ట్రాకింగ్ సాధ్యమైందని అంటున్నారు. ‘‘ఉగ్రవాదులను మేం పట్టుకొని తీరుతాం. ఆర్మీ సిబ్బంది కనుచూపు మేరలో కనిపించగానే .. ఉగ్రమూకలు కాల్పులు జరిపి తప్పించుకుంటున్నారు. దక్షిణ కశ్మీరు అడవులు చిక్కగా ఉండటంతో ఉగ్రవాదులను పట్టుకోవడం పెద్ద పరీక్షగా మారింది. ప్రస్తుతం ఎలుకా పిల్లి ఆటలా ఉగ్రవాదుల వేట సాగుతోంది’’ అని ఓ సైనిక అధికారి మీడియాకు వివరించారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలను బట్టి పిల్లి పాత్రలో బలమైన భారత సైన్యమే ఉంది. ఎలుకల్లాంటి ఉగ్రవాదులను భారత భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్ చేయడం ఖాయమనే కోణంలో ఈ వ్యాఖ్యానం ఉంది. నేడో, రేపో మన ముందుకు నలుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ వార్త రావొచ్చు.
Also Read :Fact Check : భారత సైన్యం ఆధునికీకరణకు విరాళాలు.. నిజమేనా ?
ఉగ్రవాదుల లొకేషన్లు ఇవీ..
- ఉగ్రవాదుల ఆచూకీని తొలుత అనంతనాగ్‌లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు.
- వాళ్లు తదుపరిగా కుల్గాం అడవుల్లోకి ప్రవేశించారు.
- అక్కడి నుంచి ఉగ్రవాదులు త్రాల్ కొండల్లోకి వెళ్లారు.
- త్రాల్ కొండల నుంచి కొకెర్నాగ్ అడవుల్లోకి ఎంటర్ అయ్యారు. ప్రస్తుతం అక్కడే ఉగ్రవాదులు ఉన్నారని అంటున్నారు.
- తదుపరిగా ఉగ్రవాదులు కిష్ట్‌వార్ పర్వతాల్లోకి ప్రవేశిస్తే భద్రతా దళాలకు సమస్యలు రావొచ్చని భావిస్తున్నారు. అక్కడి పర్వతాలు పహల్గాం వైపు శిఖరాలతో కలిసి ఉంటాయి. ఉగ్రవాదులు పహల్గాం శిఖరాల నుంచి చిక్కటి అడవులున్న జమ్మూ ప్రాంతంలోకి చొరబడే ముప్పు ఉంటుంది.
- ఉగ్రవాదులు ఆహారం కోసం ఏదైనా గ్రామం సమీపంలోకి వెళ్లినప్పుడల్లా భారత భద్రతా బలగాలకు ఇంటెలీజెన్స్ సమాచారం అందుతోంది.