Petrol Diesel Shortage: రాష్ట్రంలో ఇంధనం, ఎల్పీజీ కొరత..?

దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శనివారం స్పష్టం చేసింది. కొన్ని రిటైల్ ఔట్‌లెట్లలో ఇంధనం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కేవలం స్థానికంగా, తాత్కాలికంగా తలెత్తినవేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో డిమాండ్, సరఫరా మధ్య ఏర్పడిన వ్యత్యాసాల వల్లే ఈ […]

Published By: HashtagU Telugu Desk
Fuel and LPG Shortage in the State?

Fuel and LPG Shortage in the State?

దేశంలో పెట్రోల్, డీజిల్‌కు ఎలాంటి కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శనివారం స్పష్టం చేసింది. కొన్ని రిటైల్ ఔట్‌లెట్లలో ఇంధనం అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలు కేవలం స్థానికంగా, తాత్కాలికంగా తలెత్తినవేనని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఓ ప్రకటనలో తెలిపింది.

కొన్ని ప్రాంతాల్లో డిమాండ్, సరఫరా మధ్య ఏర్పడిన వ్యత్యాసాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఐఓసీ వివరించింది. ముఖ్యంగా ప్రస్తుతం పంటల కోత సీజన్ కావడంతో డీజిల్ వాడకం పెరిగిందని తెలిపింది. దీనికి తోడు ప్రైవేట్ పెట్రోల్ బంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ సంస్థల బంకుల్లో ధరలు కాస్త తక్కువగా ఉండటంతో వినియోగదారులు ఇటువైపు మళ్లుతున్నారని, దీంతో కొన్ని చోట్ల డిమాండ్ ఒక్కసారిగా పెరిగిందని పేర్కొంది. సంస్థాగత కొనుగోళ్లు కూడా ప్రభుత్వ రంగ బంకుల్లోనే ఎక్కువగా జరగడం ఒత్తిడికి మరో కారణమని వివరించింది.

దేశవ్యాప్తంగా తమకు 42,000 పైగా ఫ్యూయల్ స్టేషన్లు ఉండగా, కేవలం అతికొద్ది సంఖ్యలో మాత్రమే సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయని ఐఓసీ తెలిపింది. చాలా బంకుల్లో నిల్వలు సాధారణంగానే ఉన్నాయని, పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని భరోసా ఇచ్చింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే ఈ స్థానిక సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించింది.

మళ్లీ పెరిగిన ధరలు
ఇదిలా ఉంటే.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచుతున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. గడిచిన 10 రోజుల్లో ధరలు పెరగడం ఇది మూడోసారి. తాజా పెంపుతో లీటర్ పెట్రోల్‌పై రూ. 0.87, డీజిల్‌పై రూ. 0.91 మేర భారం పడింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతోనే ధరలను సవరించాల్సి వస్తోందని కంపెనీలు పేర్కొన్నాయి.

  Last Updated: 23 May 2026, 01:01 PM IST