Maoists Encounter : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం మావోయిస్టుల కంచుకోట. ప్రస్తుతం అది బీటలు బారుతోంది. వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతోంది. తాజాగా శనివారం అర్ధరాత్రి నారాయణ్‌పూర్- దంతెవాడ జిల్లాల బార్డర్‌లోని అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు జరిపిన ప్రతి కాల్పుల్లో దంతెవాడ డీఆర్‌జీ హెడ్ కానిస్టేబుల్ కరమ్ అమరుడయ్యారు.
Also Read :OYO New Rule : ఓయో హోటల్స్ షాకింగ్ నిర్ణయం.. వాళ్లకు నో బుకింగ్స్
అబూజ్ మడ్‌లోని అడవుల్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్త సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారు. వారు భద్రతా బలగాలపైకి కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాల ప్రతికాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టులకు చెందిన ఏకే 47 రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ వంటి ఆటోమెటిక్ ఆయుధాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారులు(Maoists Encounter) వెల్లడించారు.
Also Read :Isckon Employee Fled : రూ.లక్షల విరాళాలతో బిచాణా ఎత్తేసిన ఇస్కాన్ ఉద్యోగి
- 2024 సంవత్సరంలో వరుస ఎన్‌కౌంటర్ల వల్ల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు తీవ్రంగా నష్టపోయారు. వారి నెట్‌వర్క్ బాగా దెబ్బతింది.
- గత ఏడాది వ్యవధిలో వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 219 మంది మావోయిస్టులు చనిపోయారు.
- 2025 సంవత్సరంలో ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. జనవరి 3వ తేదీన రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు హతమయ్యాడు.
- 2026 సంవత్సరం మార్చిలోగా దేశం నుంచి మావోయిస్టులను పూర్తిగా ఏరిపారేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదేపదే ప్రకటిస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఛత్తీస్‌గఢ్‌లోని అడవుల్లో మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లు వేగాన్ని పుంజుకున్నాయి.
- 2024 సంవత్సరం డిసెంబరు మొదటి వారంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బస్తర్, కొండాగావ్ జిల్లాలకు మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించామని వెల్లడించింది. ఆయా జిల్లాల్లో రోడ్లు, పాఠశాలల ఏర్పాటు పనులను వేగవంతం చేస్తామని తెలిపింది. ఆయా జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని రాష్ట్ర సర్కారు ఆనాడు పేర్కొంది.
- ‘బస్తర్ ఒలింపిక్’ పేరుతో ఛత్తీస్‌గఢ్ సర్కారు నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు వేడుకలకు డిసెంబరు నెలలో స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారు. అంతేకాదు దండకారణ్యంలోనే ఒకరాత్రి బస కూడా చేశారు.