Pro Khalistan Group: ‘జస్టిస్ లీగ్ ఇండియా’ అనే ఖలిస్తానీ వేర్పాటువాద గ్రూపు టెలిగ్రాం వేదికగా సంచలన ప్రకటన విడుదల చేసింది. ఆదివారం రోజు ఢిల్లీలోని రోహిణి ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడు జరిపింది తామేనని వెల్లడించింది. లారెన్స్ బిష్ణోయి లాంటి కొందరు గూండాలతో భారత నిఘాసంస్థలు తమ సభ్యుల నోరుమూయించాలని చూస్తే అది మూర్ఖత్వమే అవుతుందని ‘జస్టిస్ లీగ్ ఇండియా’ తమ టెలిగ్రాం పోస్టులో ప్రస్తావించింది. ‘‘మేం వారికి ఎంత దగ్గరగా ఉన్నామో ఏమాత్రం ఊహించలేరు. ఏక్షణమైనా దాడి చేయగల సత్తా మాకు ఉంది. ఖలిస్తాన్ జిందాబాద్’’ అని జస్టిస్ లీగ్ ఇండియా పేర్కొంది.ఈ టెలిగ్రాం పోస్ట్‌ను బట్టి ఢిల్లీ పోలీసులు(Pro Khalistan Group) ఒక ప్రాథమిక అంచనాకు వచ్చారు. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాదుల హత్యలకు ప్రతీకారంగా ఈ పేలుడు జరిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Also Read :Air India : ఎయిర్ ఇండియాకు ఉగ్రవాది పన్నూ సంచలన వార్నింగ్
‘జస్టిస్ లీగ్ ఇండియా’ పోస్ట్ చేసిన మెసేజ్‌ను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ మెసేజ్‌ను పోస్ట్ చేసిన ‘జస్టిస్ లీగ్ ఇండియా’ ప్రొఫైల్‌తో ముడిపడిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని కోరుతూ టెలిగ్రామ్‌కు ఢిల్లీ పోలీసులు, ఇతర దర్యాప్తు విభాగాల అధికారులు లేఖలు రాశారు. టెలిగ్రాం నుంచి సమాచారం అందగానే సదరు సంస్థ మూలాలను వెతికే పనిని భారత నిఘా సంస్థలు, దర్యాప్తు సంస్థలు ముమ్మరం చేయనున్నాయి. సీఆర్పీఎఫ్ పాఠశాల వద్ద పేలుడు కోసం తక్కువ శక్తి ఉన్న ఐఈడీని వాడినట్లు గుర్తించారు. రిమోట్ కంట్రోల్, టైమర్‌లను వాడి సమీపం నుంచే దాన్ని పేల్చారని అంచనా వేస్తున్నారు. సీఆర్పీఎఫ్ పాఠశాల పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించి విశ్లేషిస్తున్నారు. తెల్ల టీషర్ట్ ధరించిన ఓ అనుమానితుడిని గుర్తించారు. పేలుడు జరగడానికి ముందు రోజు రాత్రి ఆ ప్రదేశంలో అతడు ఏదో చేస్తున్నట్లు సీసీటీవీలో రికార్డ్ అయింది. పేలుడు పదార్థాలను ఒక పాలిథిన్ బ్యాగ్‌లో చుట్టి అక్కడ అడుగు గోతిలో అమర్చి, చెత్తతో కప్పి ఉండొచ్చని భావిస్తున్నారు.
Also Read :Police Commemoration Day : పోలీసు అమరులకు జై.. అలుపెరుగని యోధులకు సెల్యూట్
కెనడా, అమెరికా, పాకిస్తాన్ ప్రభుత్వాలు ప్రస్తుతం ఖలిస్తానీలకు మద్దతును అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో రష్యాకు భారత్ చేరువ అవుతోంది. చైనాతోనూ సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటోంది. ఈ తరుణంలో భారత్‌ను ఖలిస్తానీలు లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం.