Delhi CM Race: ఢిల్లీకి కాబోయే సీఎం ఎవరు ? అనే దానిపై బీజేపీ హైకమాండ్ మేధోమధనం చేస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ అంశంపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చేలోగా, కనీసం ముగ్గురు ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యేలను సీఎం అభ్యర్థులుగా షార్ట్‌లిస్ట్ చేయాలని భావిస్తున్నారు. ప్రధాని మోడీ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఒకరికి సీఎంగా ఛాన్స్ ఇస్తారని సమాచారం. ప్రస్తుతం సీఎం ఎంపిక కోసం ఎలా కసరత్తు జరుగుతోంది ? ఏ తరహా ఢిల్లీ సీఎంను బీజేపీ హైకమాండ్ కోరుకుంటోంది ? అనే వివరాలను ఈ కథనంలో చూద్దాం..
ఆర్‌ఎస్ఎస్ నేపథ్యం
యోగి ఆదిత్యనాథ్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. దేశంలోనే డైనమిక్ సీఎంగా యోగి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ యోగి లాంటి నేతకే ఢిల్లీ సీఎం పీఠాన్ని అప్పగించాలని భావిస్తోందట. ఆ తరహా నేత కోసం ప్రస్తుతం కమలదళం పెద్దలు అన్వేషిస్తున్నారు. యోగి విషయానికి వస్తే.. ఆయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది. అంటే ఢిల్లీలోనూ ఆర్‌ఎస్ఎస్ నేపథ్యం కలిగిన వారికే సీఎంగా ఛాన్స్ దక్కొచ్చు. చాలా ఏళ్లుగా పార్టీలో ఉంటున్న వారినే ముఖ్యమంత్రి చేయాలని భావిస్తున్నారు. తద్వారా పార్టీని ఢిల్లీలో మరింత బలోపేతం చేయడం ఈజీ అవుతుందని నడ్డా, అమిత్‌షా భావిస్తున్నారు.
కొత్త ముఖం
ఇంతకుముందు ఎన్నడూ పెద్ద పదవులు చేపట్టని వారికే సీఎం(Delhi CM Race) సీటును బీజేపీ పెద్దలు అప్పగించే అవకాశం ఉంది. ఓటమి సమయాల్లోనూ బీజేపీని వదలకుండా నిలబడిన అంకితభావం కలిగిన నేతను సీఎం సీటుకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ ఢిల్లీలో పాలనను ముందుకు తీసుకెళ్లే నైపుణ్యాలు కలిగిన నేతకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. బీజేపీ పార్టీపరమైన వ్యవహారాలపై అవగాహన కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. మొత్తం మీద ఎవరూ ఊహించని కొత్త నేతను సీఎంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది.
లా అండ్ ఆర్డర్
దేశ రాజధాని ఢిల్లీలో క్రైమ్ రేటు గత పదేళ్లలో గణనీయంగా పెరిగింది. నడిరోడ్డుపై హత్యలు, లూటీలు జరిగిన ఉదంతాలు సైతం చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ అంశాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో జనంలోకి తీసుకెళ్లి బీజేపీ బాగానే లబ్ధి పొందింది. ప్రజలు బలమైన లా అండ్ ఆర్డర్ కోసం బీజేపీపై నమ్మకాన్ని చూపించారు. ఈవిషయంలో రాజీపడకుండా నిర్ణయాలు తీసుకునే సత్తా కలిగిన నేత కోసం బీజేపీ పెద్దలు వెతుకుతున్నారు. అలాంటి లీడరుకు సీఎం సీటును అప్పగించే ఛాన్స్ ఉంది.