Congress OBC Card : కాంగ్రెస్ ఓబీసీ కార్డు.. ఆ పార్టీ మెడకే చుట్టుకుంటుందా?

కాంగ్రెస్ (Congress) పార్టీ ఇటీవల చట్టసభల్లో, ఉద్యోగాల్లో, అన్ని చోట్లా ఓబీసి ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉండాలని బహిరంగంగా డిమాండ్ చేస్తోంది.

  • Written By:
  • Updated On - October 11, 2023 / 11:22 AM IST

By: డా. ప్రసాదమూర్తి

Congress OBC Card : ఏదైనా డిమాండ్ చేయడం వేరు.. దాన్ని అమలు చేయడం వేరు. చెప్పడానికేం చాలా చెప్తాం గానీ ఆచరణలోకి వచ్చేసరికి మనం చెప్పే మాటలే మనకు శత్రువుల్లా మారిపోతాయి. రాజకీయాల్లో ఇది మరీ తరచూ చూసే చోద్యమే. కాంగ్రెస్ (Congress) పార్టీ ఇటీవల చట్టసభల్లో, ఉద్యోగాల్లో, అన్ని చోట్లా ఓబీసి ప్రాతినిధ్యం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉండాలని బహిరంగంగా డిమాండ్ చేస్తోంది. ఇది చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన సందర్భం నుంచి మొదలైంది. ఆ తర్వాత ఇటీవల కాలంలో బీహార్ కులాధార జనగణన చేసి, ఆ వివరాలను బహిర్గతం చేసిన నాటి నుంచి కాంగ్రెస్ (Congress) మరింతగా ఈ డిమాండ్ ను ముందుకు తెస్తోంది. దేశమంతా క్యాస్ట్ సర్వే జరగాలని ఆ పార్టీ పదేపదే డిమాండ్ చేస్తోంది. అంతే కాదు తాము అధికారంలోకి వస్తే దీన్ని దేశమంతా అమలు చేస్తామని, రాష్ట్రాల్లో అధికారం ఉన్నచోట క్యాస్ట్ సెన్సస్ నిర్వహిస్తామని చెప్తున్నారు. చెప్పడమే కాదు రాజస్థాన్లో ఇప్పటికే క్యాస్ట్ సర్వే కోసం చర్యలు చేపడుతున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ ప్రకటించారు.

తాజాగా ఢిల్లీలో జరిగిన సిడబ్ల్యుసి మీటింగ్ లో కూడా దేశవ్యాప్తంగా ఓబీసీలకు జనాభా సంఖ్య ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ను ప్రముఖంగా పేర్కొన్నారు. ఇదంతా బానే ఉంది. మరి తమ డిమాండ్ ను తామే అమలు చేస్తున్నారా లేదా అనే విషయం సహజంగానే చర్చకు వస్తుంది కదా. ఇప్పుడు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ (Congress) పార్టీ తన అభ్యర్థులలో ఎంతమంది ఓబీసీలకు సీట్లు ఇచ్చింది? ఆ రాష్ట్రంలో, ఆయా రాష్ట్రాల్లో ఓబీసీల ప్రాతినిధ్యం మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిందా లేదా అనే విషయం కూడా చర్చకు వస్తుంది. బయటి వారి ప్రశ్నలు, చర్చలు అలా ఉంచితే, పార్టీ లోపలే కులాల వారీగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక్క తెలంగాణ తీసుకుంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీల నుంచి ఓబీసీల నుంచి ముస్లింల నుంచి మహిళల నుంచి తమ వాటా పెంచమని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఇదిప్పుడు పార్టీకి తల నొప్పిగానే మారిందని చెప్పాలి.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. ఎన్నికలకు ఇంకా 50 రోజులు కూడా సమయం లేదు. ఈ షెడ్యూల్ ప్రకటించడానికి 50 రోజులు ముందే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసి రేసులో చాలా ముందు నిలుచుంది. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా వెనుకబడి ఉందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ దఫాలు దఫాలుగా సమావేశం అవుతోంది. హైదరాబాదు నుంచి ఢిల్లీ దాకా ఈ సమావేశాలు జరుగుతున్నాయి. కానీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడానికి పార్టీ అధిష్టానం ఇంకా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపించడం లేదు. దీనికి పార్టీలో తమ వర్గానికి, తమ కులానికి ప్రాతినిత్యం పెరగాలన్న ఒత్తిడే కారణం అన్నది బహిరంగ రహస్యమే. పార్టీలో అసలే ఎక్కడా లేని సీనియర్ల హడావిడి ఇక్కడ బాగా ఉంది.

ఉత్తమ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, హనుమంతరావు, కోమటిరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కి.. ఇలా హేమాహేమీలు వారి సీట్ల మాట అటుంచి, వారి వర్గాల అభ్యర్థుల కోసం పట్టు పడుతున్నారన్న విషయం అర్థమవుతూనే ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కులాల వారీగా ప్రాతినిథ్యం ఇవ్వాలని ఓపెన్ గా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అది సొంత పార్టీలోనే ఆ డిమాండ్ కు ఊపునిచ్చింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిని ఇరకాటంలో పెట్టడానికి చేశారో.. లేక నిజాయితీగానే చేస్తున్నారో తెలియదు గానీ, కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కార్డు ఆ పార్టీ మెడకే బిగుసుకుంటుందని ప్రస్తుత పరిణామాలు చూస్తుంటేఅర్థమవుతుంది.

తెలంగాణలో బీసీలకు 34 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీలో పలువురు బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సంబంధించిన స్క్రీనింగ్ కమిటీలో అన్ని వర్గాల సీనియర్ నాయకులకూ స్థానం కల్పించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని స్థానాలలో సామాజిక సమీకరణాల, బలాబలాల సర్వేలు నిర్వహించారు. వాటి ఆధారంగా అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ కు అనుగుణంగా ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను ఓబీసీలకు కేటాయించాలని ఈ స్క్రీనింగ్ కమిటీ లోని బీసీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మహిళా నాయకులు తమకు 12 సీట్లు కేటాయించాలని వేరే డిమాండ్ మొదలుపెట్టారు.

Also Read:  CM KCR Election Campaign : ఎన్నికల సమరానికి ‘సై’ అంటున్న కేసీఆర్..17 రోజుల పర్యటనకు షెడ్యూల్ ఫిక్స్

మరోవైపు ముస్లిం నాయకులు కూడా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడ తెరపైకి తీసుకువచ్చి, అదే ఫార్ములాని తెలంగాణలో కూడా అమలు చేయాలని, పాతబస్తీ తో పాటు బయట కూడా ఆరు సీట్లు పైగా ముస్లింలకు కేటాయించాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంకోపక్క కమ్మ సామాజిక వర్గం నాయకులు తమ మద్దతు కావాలంటే కనీసం 12 సీట్లు తమ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. వారు ఢిల్లీ పెద్దలను కూడా ఈ విషయంలో మాటిమాటికి కలిసి వారిని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. దీనికి తోడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ కోటా తో పాటు జనరల్ స్థానాల్లో కూడా ఎస్సీ ఎస్టీలకు అదనంగా కొన్ని సీట్లు కేటాయించాలని ఆ వర్గాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

ఇలా పలు వర్గాల నాయకుల డిమాండ్ల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల చేయడం రోజురోజుకీ మరింత జటిలమవుతున్నదన్న ఊహాగానాలు వార్తల్లో స్వైర విహారాలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగానూ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనూ కులాల వారీగా జనాభా నిష్పత్తికి అనుగుణంగా అన్నింటా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తామని కాంగ్రెస్ ఇటీవల చేస్తున్న గట్టి ప్రచారం, ఇప్పుడు ఆ పార్టీనే చుట్టుముడుతున్నదా అన్న అనుమానాలు సర్వత్రా కలుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో బయటి వారికి చెప్పే సమాధానాలు మాట అటుంచి, పార్టీ లోపల వివిధ వర్గాల నాయకులను ఏ విధంగా కన్విన్స్ చేసి, అభ్యర్థుల జాబితాను ఖరారు చేస్తారో, కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

అందుకే డిమాండ్ చేయడం ఈజీనే గాని అమలు చేయడం అంత సులువు కాదు. మరి ఈ కసరత్తులో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఒక పెద్ద అవరోధాన్ని అధిగమించి, వారు భవిష్యత్తులో సామాజిక న్యాయం అనే సూత్రాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తారన్న హామీ ఇవ్వగలుగుతారు.

Also Read:  Chandrababu : చంద్రబాబు కు స్వల్ప అస్వస్థత.. డీహైడ్రేషన్ తో ఇబ్బందిపడుతున్న చంద్రబాబు.