ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGIA) శుక్రవారం ఉదయం భారీ గందరగోళం నెలకొంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక లోపం ఏర్పడటంతో 100కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి. దీనితో ప్రయాణికులు విమానాశ్రయంలోనే గంటల తరబడి ఇరుక్కుపోయారు. సమాచారం ప్రకారం.. గురువారం సాయంత్రం నుంచే ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) లో సమస్య తలెత్తింది. ఈ AMSS వ్యవస్థ ఆటో ట్రాక్ సిస్టమ్ (ATS) కు అవసరమైన డేటాను అందిస్తుంది. అదే డేటా ఆధారంగా విమాన ప్రణాళికలు సిద్ధమవుతాయి. అయితే, సిస్టమ్ పనిచేయకపోవడంతో కంట్రోలర్లు ఈ ప్రణాళికలను చేతితో రూపొందించాల్సి రావడంతో పనితీరు మందగించింది.
Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!
దేశంలో అత్యధిక రద్దీగా ఉండే ఢిల్లీ విమానాశ్రయం రోజుకు సుమారు 1,500 విమానాల రాకపోకలకు కేంద్రంగా ఉంటుంది. సాంకేతిక లోపం కారణంగా ఉదయం మొత్తం విమాన రాకపోకల్లో భారీ ఆలస్యం చోటుచేసుకుంది. ఫ్లైట్‌రాడార్24 వెబ్‌సైట్ ప్రకారం, ఉదయం 9 గంటల నాటికి విమాన బయలుదేరే సగటు ఆలస్యం 45 నుంచి 50 నిమిషాల వరకు నమోదైంది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) ప్రతినిధులు ఈ లోపాన్ని ధృవీకరిస్తూ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సాంకేతిక బృందాలు సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు ఆలస్యాలపై ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.
Sunday: ఆదివారం రోజు ఇప్పుడు చెప్పినట్టు పూజ చేస్తే చాలు.. కలిగే ఫలితాలు అస్సలు నమ్మలేరు!
ప్రయాణికులు విమానాల్లో మరియు విమానాశ్రయంలోనే గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సమస్యలను వెల్లడించారు. సాంకేతిక నిపుణులు వ్యవస్థ పునరుద్ధరణ పనులను కొనసాగిస్తుండగా, అధికారులు ఈ లోపం కారణంగా సృష్టైన బ్యాక్లాగ్ సరిచేయడానికి మరికొన్ని గంటలు పట్టవచ్చని హెచ్చరించారు. లక్నో, జైపూర్, చండీగఢ్, అమృత్‌సర్ వంటి ఉత్తర భారత విమానాశ్రయాల్లో కూడా ప్రభావం కనిపించింది. మధ్యాహ్నం నాటికి ATC కార్యకలాపాలు స్థిరంగా ఉన్నప్పటికీ, సాధారణ వేగంతో పోలిస్తే నెమ్మదిగా కొనసాగుతున్నాయని AAI అధికారులు తెలిపారు.
