Site icon HashtagU Telugu

Pegasus Spyware : ఇజ్రాయెలీ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ కేసు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Pegasus Spyware Case Central Government National Security Supreme Court

Pegasus Spyware : పెగాసస్‌ అనేది ప్రమాదకర స్పైవేేర్. దీన్ని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ తయారు చేసింది. ఎన్ఎస్‌ఓ ప్రధాన కార్యాలయం ఇజ్రాయెల్‌లోనే ఉంది. కొన్ని నెలల క్రితమే లెబనాన్‌లో ఇజ్రాయెల్ దారుణమైన పేజర్ పేలుళ్లు చేయించింది. ఆ దాడులు తమ పనే అని ఇజ్రాయెల్ ఒప్పుకుంది. ఈ దాడులకు ప్లానింగ్ చేసే క్రమంలో పెగాసస్ స్పై వేర్‌ను ఇజ్రాయెల్ వాడుకుంది. తమ పొరుగుదేశం జోర్డాన్‌లోని జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను కూడా ఈ స్పై వేర్‌తో ఇజ్రాయెల్ ట్రాక్ చేసింది. ఇక మన దేశంలో చోటుచేసుకున్న కొత్త అప్‌డేట్‌లోకి వెళ్దాం..   ‘‘జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఒక దేశం స్పైవేర్‌ను కలిగి ఉండటంలో తప్పేం లేదు. అయితే దాన్ని ఎలా ఉపయోగిస్తున్నారు ?  ఎవరిపై ఉపయోగిస్తున్నారు ? అనే దాని గురించి ఆలోచించడం అవసరం’’ అని భారత సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 2021 సంవత్సరంలో మన దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్‌ కేసు వ్యవహారంపై  సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌‌లతో కూడిన ధర్మాసనం  ఈమేరకు అభిప్రాయాన్ని వ్యక్తపర్చింది.

Also Read :KCR Vs BJP : కాంగ్రెస్‌ విలన్ ఐతే.. బీజేపీ ఫ్రెండా ? కేసీఆర్ మాటలకు అర్థాలే వేరులే!

వాదన ఇదీ.. 

పెగాసస్ స్పైవేర్‌ను  వినియోగించి మన దేశంలోని జర్నలిస్టులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలతో సుప్రీంకోర్టులో అప్పట్లో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు(Pegasus Spyware) విచారణ జరిపింది. పెగాసస్‌ సంబంధిత  ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని న్యాయస్థానాన్ని పిటిషనర్లు కోరారు. ‘‘పెగాసస్‌ స్పైవేర్‌ను భారత సర్కారు ఉపయోగిస్తోందా? లేదా ? అనే దానిపై క్లారిటీ ఇవ్వాలి.  ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపించి సాంకేతిక నిపుణుల బృందం నివేదికను సమర్పించాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది.  ఇప్పటివరకూ ఆ నివేదిక సుప్రీంకోర్టుకు అందలేదు. దాన్ని వెంటనే ఇవ్వాలి’’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘దేశం ఒక స్పైవేర్‌ను వినియోగిస్తే తప్పేముంది. దాన్ని దేశ వ్యతిరేక శక్తులపై వినియోగిస్తే ఏ తప్పూ లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు’’ అని సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది.

Also Read :Target PoK : పీఓకే‌పైనే భారత్ గురి.. ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లే లక్ష్యం

ఆ నివేదికను బహిర్గతం చేయడం సరికాదు: సుప్రీంకోర్టు

పహల్గాం ఉగ్రదాడి ఘటనను ధర్మాసనం ప్రస్తావిస్తూ.. ‘‘ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు. మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని కామెంట్ చేసింది. సాంకేతిక బృందం నివేదికపై సుప్రీంకోర్టు బెంచ్ స్పందిస్తూ..  ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే వారికి సమాచారం అందిస్తాం. అంతేగానీ వీధుల్లో చర్చించుకునే ఓ డాక్యుమెంట్‌గా ఈ నివేదిక మారకూడదు’’ అని స్పష్టం చేసింది.