Site icon HashtagU Telugu

Bomb threats: స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు.. బెంగళూరులో 40.. ఢిల్లీలో 20కి పైగా పాఠశాలలకు బెదిరింపు మెయిల్స్

Bomb threats to 40 schools in Bengaluru, over 20 schools in Delhi

Bomb threats to 40 schools in Bengaluru, over 20 schools in Delhi

Bomb threats : బెంగళూరులో శుక్రవారం ఉదయం తీవ్ర ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది. నగరంలోని 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపింది. ముఖ్యంగా రాజరాజేశ్వరీనగర్‌, కెంగేరి ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు ఈ బెదిరింపులు ఎక్కువగా వచ్చాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బెంగళూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. బృందాలుగా విడిపోయి ఆయా ప్రాంతాలకు చేరుకుని పాఠశాలలలో ఖాళీ చేయించిన అనంతరం సమగ్ర తనిఖీలు ప్రారంభించారు. బాంబ్ స్క్వాడ్ టీమ్‌లు కూడా రంగంలోకి దిగి స్కూళ్ల ప్రాంగణాలను, తరగతి గదులను, కిచెన్లు, బాగ్స్ ఇలా ప్రతి మూలను జల్లెడపడుతున్నారు. తాత్కాలికంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించి విద్యార్థులు, అధ్యాపకులను బయటకు తరలించారు. ఇప్పటివరకు పేలుడు పదార్థాలు ఏవీ కనుగొనలేదని అధికారులు తెలిపారు. అయితే, బెదిరింపు ఉన్నందున ఏ చిన్న విషయానికైనా విస్మయం చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

Read Also: Women : 35 ఏళ్లకు పైబడిన మహిళల్లో తక్కువ మెటబాలిజం..హై ప్రొటీన్ లభించే ఫుడ్స్ ఇవే!

ఇక మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా 20కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. స్కూళ్ల వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు ప్రారంభించాయి. బెదిరింపు మెయిల్ అందుకున్న పాఠశాలలలో సివిల్ లైన్స్‌లోని సెయింట్ గ్జావియర్స్, పశ్చిమ విహార్‌లోని రిచ్‌మండ్ గ్లోబ‌ల్ స్కూల్‌, రోహిణిలోని అభినవ్ పబ్లిక్ స్కూల్‌, ది సావిరిన్ స్కూల్‌లు ఉన్నాయి.

బెదిరింపు మెయిల్‌లో ఉన్న కంటెంట్ భయంకరం

పోలీసుల కథనం ప్రకారం, ఈ బాంబు బెదిరింపు మెయిల్‌లో చాలా తీవ్రమైన భావోద్వేగాలు, మానసిక స్థితిని ప్రతిబింబించేలా ఉన్నట్లు వెల్లడించారు. హలో. నేను మీ స్కూల్ తరగతి గదుల్లో ట్రినిట్రోటోలుయెన్ పేలుడు పదార్థాలను పెట్టాను. అవి నల్ల ప్లాస్టిక్ సంచులలో జాగ్రత్తగా దాచబడ్డాయి. మీలో ఒక్కరూ బ్రతకరు. నేను మిమ్మల్ని ఈ ప్రపంచం నుంచి తుడిచివేస్తాను. మృతదేహాల దృశ్యాలను చూస్తూ తల్లిదండ్రులు విలపిస్తుంటే నేను నవ్వుతాను అని మెయిల్లో ఉంది. ఆ తర్వాత అతను తన ఆత్మహత్య యత్నం గురించి కూడా రాశాడు నాకు జీవితం అసహ్యంగా ఉంది. నేను నా గొంతు కోసుకుంటాను. మణికట్టును కోసుకుంటాను. ఎప్పుడూ నాకు సహాయం అందలేదు. నా మానసిక సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. మానసిక వైద్యులు మందుల మీద మాత్రమే దృష్టి పెడతారు. ఆ మందులు శరీరాన్ని నాశనం చేస్తాయి. వారివల్ల నాకు ప్రయోజనం కలగలేదు. నేను ప్రత్యక్ష ఉదాహరణ. మీరు కూడా నాకు లాంటి బాధ అనుభవించాలి. అందుకే ఈ పని చేస్తున్నాను అని లేఖలో ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు.

పోలీసుల స్పందన

ఈ మెయిల్ కేవలం బెదిరింపు తీరులో ఉన్నదా? లేక వాస్తవంగా పథకం ప్రకారం ఎటువంటి కుట్ర ఉన్నదా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మెయిల్ ట్రేస్ చేయడానికి సైబర్ క్రైం శాఖ రంగంలోకి దిగింది. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన

ఈ ఘటనలతో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అనేక మంది తల్లిదండ్రులు తాత్కాలికంగా తమ పిల్లలను స్కూళ్లకు పంపకుండా ఇంట్లోనే ఉంచుతున్నారు. పలువురు పిల్లలు భయంతో సైతం మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కాగా, ఇలాంటి బెదిరింపులు పాఠశాలలపై, విద్యార్థులపై తీవ్ర మానసిక భయం కలిగిస్తాయి. ఇది విద్యా వ్యవస్థపై దాడిగా పరిగణించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీవ్రంగా పరిగణించి, ఇలాంటి బెదిరింపులకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు మానసిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, సహాయం అవసరమైన వారికి నిఖార్సైన మద్దతు అందకపోవడం వల్ల జరుగుతున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే.. బుధ‌వారం కూడా సుమారు ఏడు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలో బెదిరింపు మెయిల్స్‌ రావ‌డం వారంలోనే ఇది మూడోసారి. మంగ‌ళ‌వారం ఉద‌యం నార్త్ క్యాంప‌స్‌లో ఉన్న సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ, ద్వార‌క‌లోని సెయింట్ థామ‌స్ స్కూల్‌కు బెదిరింపులు వ‌చ్చాయి.

Read Also: Bhupesh Baghel : ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంటిపై ఈడీ దాడులు