Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం థానేలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. అరెస్టయిన నిందితుడిని మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షాజాద్ (వయస్సు 30)గా గుర్తించారు. అతడు బంగ్లాదేశ్‌కు చెందినవాడని, అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించి తన పేరును విజయ్ దాస్‌గా మార్చుకున్నట్లు అధికారులు తెలిపారు. అతనికి భారత పౌరుడని నిరూపించే ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించారు.
అతడు ముంబైకు కొన్ని నెలల క్రితం వచ్చి, మధ్యలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 15 రోజుల క్రితమే మళ్లీ ముంబైకు తిరిగి వచ్చిన అతడు హౌస్‌కీపింగ్ ఏజెన్సీలో పనిచేయడం ప్రారంభించాడు. దొంగతనమే లక్ష్యంగా సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించిన అతడు, అడ్డుగా వచ్చిన సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు.
AP BJP : ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. తేల్చబోతున్న అమిత్ షా
సైఫ్‌పై దాడి జరిగిన ఘటనకు సంబంధించి నిందితుడిని 72 గంటల తరువాత పట్టుకోగలిగారు. ఈ దాడి కేసు ఛేదన కోసం ముంబై పోలీసులు , క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన 30 ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేశారు. ఈ బృందంలో 100 మందికి పైగా పోలీసులు పాల్గొన్నారు. నిందితుడి కోసం దేశవ్యాప్తంగా 15కి పైగా నగరాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టారు. చివరకు థానేలో అతడిని పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. 2025 జనవరి 16న ఈ దాడి జరిగినట్లు పోలీసులు వివరించారు. బాంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని సైఫ్ అలీఖాన్ నివాసంలో ఈ దాడి జరిగింది. దొంగతనం చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు, సైఫ్‌ను అడ్డుకున్న సందర్భంలో కత్తితో దాడి చేశాడు.
సైఫ్ శరీరంలో ఆరు చోట్ల గాయాలు కాగా, రెండు గాయాలు తీవ్రమైనవి. సైఫ్ శరీరం నుంచి రెండున్నర అంగుళాల కత్తిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. మహ్మద్ షరీఫుల్ ఇంట్లోకి ప్రవేశించిన పరిస్థితులు, దాడి వెనుక ఉన్న పూర్తి కారణాలు తెలుసుకునేందుకు ముంబై పోలీసులు ప్రాథమిక విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చిన తరువాత, తదుపరి విచారణ కోసం పోలీసులు కస్టడీ కోరనున్నారు.
ఈ కేసుపై డీసీపీ మాట్లాడుతూ, “సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడి ప్రాథమిక ఉద్దేశ్యం దొంగతనమే. అయితే, సైఫ్ అడ్డుపడటం వల్లే దాడి చేశాడు. కోర్టు అనుమతితో విచారణ మరింత లోతుగా కొనసాగించాం. అతడి దేశీ , అంతర్జాతీయ లింకులను కూడా పరిశీలిస్తున్నాం” అని తెలిపారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్టు జరగడం, దాడి వెనుక మరింత సమాచారం వెలుగులోకి రావడం కేసు ఛేదనలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.