లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించి జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్‌కు సంబంధించిన పత్రాలు ఇటీవల బయటకు రాగా, అందులో బిల్ గేట్స్ పేరు ఉండటం తీవ్ర దుమారం రేపింది. గేట్స్‌కు రష్యన్ అమ్మాయిలతో ఉన్న సంబంధాలను కప్పిపుచ్చేందుకు ఎప్‌స్టీన్ ప్రయత్నించాడని ఆ పత్రాల్లో ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఎప్‌స్టీన్ తనను బ్లాక్‌మెయిల్ చేసేందుకే ఇలా చేశాడని, ఈ ఆరోపణల్లో నిజం లేదని బిల్ గేట్స్ ఇప్పటికే స్పష్టం చేశారు.
షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11:50 గంటలకు బిల్ గేట్స్ ప్రసంగించాల్సి ఉంది. ఇప్పటికే సోమవారం భారత్‌కు చేరుకున్న ఆయన, ఆంధ్రప్రదేశ్ పర్యటన కూడా ముగించుకుని ఢిల్లీ వచ్చారు. అయితే, తాజా వివాదం నేపథ్యంలో సదస్సు అసలు ఉద్దేశం పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతోనే ఆయన తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నారని గేట్స్ ఫౌండేషన్ ‘ఎక్స్’ వేదికగా తెలిపింది. ఆయన స్థానంలో ఆఫ్రికా-ఇండియా విభాగాల ప్రెసిడెంట్ అంకుర్ వోరా ప్రసంగిస్తారని పేర్కొంది.
ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ఓపెన్ ఏఐ సీఈవో శామ్ ఆల్ట్‌మన్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వంటి టెక్ దిగ్గజాలు పాల్గొంటున్నారు. మరోవైపు, బిల్ గేట్స్ ఫౌండేషన్‌తో తమ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలను రద్దు చేసుకోవాలని బీహార్‌కు చెందిన కొందరు ఎంపీలు డిమాండ్ చేయడం గమనార్హం.
