Bangladeshi Hand : మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మార్చి 17న జరిగిన అల్లర్లపై సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ అల్లర్ల వెనుక బంగ్లాదేశీయులు లేదా విదేశీయుల హస్తం ఉందనేది ఇప్పుడే నిర్ధారించలేమని ఆయన స్పష్టం చేశారు. ‘‘నిఘా విభాగాల వైఫల్యం వల్లే ఈ అల్లర్లు జరిగాయని చెప్పలేం. నిఘా విభాగాలు ఇంకాస్త మెరుగ్గా పనిచేసి ఉంటే బాగుండేది’’ అని సీఎం పేర్కొన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన హింసాకాండకు సంబంధించిన కారణాలపై మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులతో సీఎం ఫడ్నవిస్(Bangladeshi Hand) సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read :MLA Rajasingh: తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. రాజాసింగ్ సంచలన కామెంట్స్
104 మందిపై కేసులు..
‘‘దర్యాప్తు పూర్తయితే కానీ నాగ్‌పూర్ అల్లర్లకు కారకులైన వారి వివరాలు తెలిసే అవకాశం లేదు.ఈ హింసకు కారకులైన వారి నుంచే ఆస్తి నష్టం మొత్తాన్ని వసూలు చేస్తాం. వారు డబ్బు చెల్లించకుంటే ఆస్తులను స్వాధీనం చేసుకొని అమ్ముతాం’’ అని సీఎం ఫడ్నవిస్ వెల్లడించారు. ‘‘మతపరమైన వస్తువులను దహనం చేశారనే వదంతులు సోషల్ మీడియాలో వ్యాపించాయి. వాటిని కొందరు నిజమేనని నమ్మి రోడ్లపైకి వచ్చారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ అల్లర్లలో పాల్గొన్న 104 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో వదంతులు వ్యాపింపజేసిన వారినీ నిందితులుగానే పరిగణిస్తాం. రెచ్చగొట్టేలా పెట్టిన 66 సోషల్ మీడియా పోస్ట్‌లను ఇప్పటిదాకా డిలీట్ చేయించాం’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చెప్పారు.
Also Read :Vangaveeti Radha: ఫ్యూచర్ ప్లాన్.. వంగవీటి రాధ నిర్ణయం అదేనా ?
ముగ్గురు పోలీసు డిప్యూటీ కమిషనర్లకు గాయాలు
నాగ్‌పూర్ అల్లర్లలో 34 మంది పోలీసులు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురు పోలీసు డిప్యూటీ కమిషనర్లు ఉన్నారు. దీన్నిబట్టి అల్లర్లలో ఎంత పెద్దసంఖ్యలో అల్లరి మూకలు భాగమయ్యారో అంచనా వేయొచ్చు. సాధారణంగా పోలీసుల వద్ద గన్స్ ఉంటాయి. వాటిని చూసి కూడా.. పోలీసులపై దాడికి పాల్పడటం అనేది సామాన్యులు చేసే పని కాదు. సామాన్య ప్రజానీకం చట్టాలను గౌరవిస్తారు. పోలీసులను గౌరవిస్తారు. నేరచరిత్ర కలిగిన వాళ్లపై సదరు పోలీసు అధికారులపై దాడికి పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.