Site icon HashtagU Telugu

Baba Siddique : బాబా సిద్దీఖ్‌‌ను హత్య చేసింది మేమే : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్

Baba Siddique Bishnoi Gang Maharashtra

Baba Siddique : అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దీఖ్ హత్య కాంట్రాక్టు హత్యేనని ముంబై పోలీసులు ఆదివారం ధ్రువీకరించారు. ఈ హత్యలో లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రమేయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అరెస్టయిన నిందితులు తాము లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందినవాళ్లమని చెప్పినట్లు సమాచారం. ఈ హత్య (Baba Siddique) వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనేది తమ బృందాలు ఆరా తీస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగిందన్నారు. ఈ హత్య కోసం నిందితులకు ముందస్తుగా డబ్బులు చెల్లించి.. తుపాకులను కొద్ది రోజుల క్రితమే డెలివరీ చేసినట్లు విచారణలో వెల్లడైంది.

Also Read :RSS Chief : దళితులు, అట్టడుగు వర్గాలను హిందువులు కలుపుకుపోవాలి : ఆర్ఎస్ఎస్ చీఫ్

ఈ కేసు నిందితులు హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజేష్ కశ్యప్ (19), శివకుమార్‌. ఈ ముగ్గురు బాబా సిద్దీఖ్ హత్య కోసం గత 30 రోజులుగా ఆ ప్రాంతంలో రెక్కీ నిర్వహించారు. వీరికి ఖర్చుల కోసం రూ. 50,000 చొప్పున అందాయని పోలీసులు గుర్తించారు.  ముగ్గురు షూటర్లు గత నెల రోజులుగా కుర్లాలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. గుర్మైల్ బల్జీత్ సింగ్, రాజేష్ కశ్యప్, శివకుమార్‌ కలిసి ఆటో రిక్షా ద్వారా బాబా సిద్దీఖ్‌ ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. సిద్దీఖ్‌పై కాల్పులు జరపడానికి ముందు కాసేపు అక్కడే వేచి ఉన్నారు. వీరికి ఓ వ్యక్తి నుంచి ఎప్పటికప్పుడు కమాండ్స్ అందాయి. ఆ కమాండ్స్‌కు అనుగుణంగా తన కార్యాలయం నుంచి బాబా సిద్దీఖ్‌ బయటకు రాగానే దుండగులు కాల్పులకు తెగబడ్డారు.

Also Read :Devaragattu Stick Fight : దేవరగట్టు కర్రల సమరం రక్తసిక్తం..100 మందికిపైగా గాయాలపాలు

అయితే ఈ ముగ్గురు నిందితులకు కమాండ్స్ ఇచ్చిన ఆ నాలుగో వ్యక్తి ఎవరనేది తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. నిందితులు గుర్మైల్ బల్జీత్ సింగ్, ధర్మరాజ్ రాజేష్ కశ్యప్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే శివకుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలుచోట్లకు ప్రత్యేక టీమ్‌లను పంపింది. 66 ఏళ్ల బాబా సిద్దీఖ్ శనివారం రాత్రి బాంద్రా వెస్ట్‌లోని కార్యాలయం నుంచి తన నివాసానికి బయలుదేరుతుండగా దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆరు రౌండ్ల కాల్పులు జరపగా.. మూడు బుల్లెట్లు బాబా సిద్దీఖ్‌కు తగిలాయి. ఆ వెంటనే  ఆస్పత్రికి తీసుకెళ్లేలోగా ఆయన చనిపోయారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన

బాబా సిద్దీఖ్ హత్య తమ పనే అని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈమేరకు ఆ గ్యాంగ్ సభ్యుడు ఒకరు ఫేస్‌బుక్ వేదికగా ఒక పోస్టు పెట్టారు. ‘‘సల్మాన్ ఖాన్, దావూద్ ఇబ్రహీం, అనుజ్ థాపన్‌లతో సంబంధాలు పెట్టుకున్నందు వల్లే బాబా సిద్దీఖ్‌ను హత్య చేశాం’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు.