Site icon HashtagU Telugu

Ayodhya : వెక్కివెక్కి ఏడ్చిన అయోధ్య ఎంపీ.. ప్రధాని మోడీతో మాట్లాడుతానంటూ..

Ayodhya Mp Awadhesh Prasad Breaks Down Dalit Woman Murder In Ayodhya

Ayodhya : అవధేశ్ ప్రసాద్ .. ఈయన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(ఫైజాబాద్) లోక్‌సభ నియోజకవర్గం ఎంపీ. గత ఎన్నికల్లో అయోధ్య రామమందిరం నిర్మించిన వేవ్ ఉన్నా.. బీజేపీ అభ్యర్థిని ఓడించి సమాజ్‌వాదీ పార్టీ సింబల్‌‌పై అవధేశ్ ఎంపీగా గెలిచారు. ఇవాళ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. చిన్న పిల్లవాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. బాగా ఎమోషనల్ అయిన అవధేశ్ ప్రసాద్.. తాను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడతానని ప్రకటించారు. ఇంతకీ అయోధ్య ఎంపీ ఎందుకు ఏడ్చారు ? ఏ విషయంపై ప్రధానితో మాట్లాడతానన్నారు అనే వివరాలను ఈ కథనంలో చూద్దాం..

Also Read :Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?

ఏమిటీ ఘటన?

వివరాల్లోకి వెళితే.. యూపీలోని అయోధ్య(Ayodhya) పరిధిలో ఉన్న ఒక గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి గత గురువారం (జనవరి 30) నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు.. ఒక కాల్వలో  వివస్త్రగా పడి ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. సదరు యువతి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టివేసి ఉన్నాయి. ఆమెను దారుణంగా హత్యచేశారు. శరీరంలోని వివిధ భాగాలపై లోతైన గాయాలు ఉన్నాయి. సదరు యువతిపై హత్యాచారం జరిగినట్లు దర్యాప్తులో తేలింది. ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు చర్యలు తీసుకోకపోవడం వల్లే తమ కుమార్తె ప్రాణాలు పోయాయని  ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.

Also Read :Trisha Gongadi: ఇండియాకు వ‌ర‌ల్డ్ క‌ప్ అందించిన తెలంగాణ బిడ్డ‌.. ఎవ‌రీ గొంగ‌డి త్రిష‌?

ఆమెను కాపాడలేకపోయా.. రాజీనామా చేస్తా : ఎంపీ అవధేశ్

యువతిపై జరిగిన హత్యాచారం ఘటన గురించి తెలియగానే అయోధ్య ఎంపీ అవధేశ్ ప్రసాద్ హుటాహుటిన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జరిగిన ఘటన గురించి ఆయన వివరించారు. ‘‘ఆ యువతిని కాపాడలేకపోయాం.. ఆమె దారుణంగా హత్యాచారానికి గురైంది’’ అని చెబుతూ ఎంపీ కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని నిమిషాల పాటు వెక్కివెక్కి ఏడ్చారు. ఈ ఘటనపై ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో మాట్లాడతానన్నారు. ఆ యువతి ప్రాణాలను కాపాడలేక పోయినందుకు ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ అవధేశ్ తెలిపారు. దీంతో పక్కనే ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేతలు ఆయనను సముదాయించారు. మృతురాలి కుటుంబసభ్యులకు న్యాయం చేయడానికి పోరాడాలని ఎంపీకి వారు సూచించారు.