Space Port : ఇప్పటికే మన దేశానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం 95 అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించాం. వాటిలో 80 విజయవంతమయ్యాయి. త్వరలోనే మనకు రెండో అంతరిక్ష కేంద్రం కూడా అందుబాటులోకి రాబోతోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మించనున్న రెండో అంతరిక్ష కేంద్రానికి (Space Port) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.17,300 కోట్ల విలువ కలిగిన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులను ఈసందర్భంగా ప్రధాని ప్రారంభించారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ హబ్ పోర్ట్ కూడా ఈ ప్రాజెక్టుల జాబితాలో ఉండటం గమనార్హం.
We’re now on WhatsApp. Click to Join
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాలు తమిళనాడును విస్మరించాయి. రాష్ట్ర ప్రజలు దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుంది. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త శక్తితో రాష్ట్రానికి తిరిగి వస్తా’’ అని తెలిపారు. తమిళనాడు పర్యటన అనంతరం మోడీ నేరుగా మహారాష్ట్రకు వెళ్లనున్నారు.
Also Read : March 1st : మార్చి 1 విడుదల.. కొత్త నెల కొత్త రూల్స్
సెకండ్ స్పేస్ స్టేషన్ విశేషాలివీ..
- తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో రెండో అంతరిక్ష కేంద్రం నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుంది.
- దీని నిర్మాణ వ్యయం రూ. 986 కోట్లు.
- భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న కులశేఖరపట్నంలోని రాకెట్ లాంచ్ ప్యాడ్ ఉపగ్రహాలను ఉంచేందుకు అనువుగా ఉంటుంది.
- రెండో అంతరిక్ష కేంద్రాన్ని 2,350 ఎకరాలలో నిర్మిస్తారు.
- దీనికోసం 2022 జూలై నాటికే 1950 ఎకరాల భూమిని సేకరించారు.
- తమిళనాడు ప్రభుత్వం అదనంగా తూత్తుకుడి ప్రాంతంలో 961 హెక్టార్లకుపైగా కేటాయించింది.
Also Read : Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్
శ్రీహరికోట వర్సెస్ కులశేఖరపట్టినం
కులశేఖరపట్టినం స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించే శాటిలైట్ వాహక నౌకలు (రాకెట్లు) నేరుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. ఇక ఇదే సమయంలో శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్లు శ్రీలంక మీదుగా వెళ్లకుండా ఉండేందుకుగానూ ఆగ్నేయ దిశ వైపుగా దిశను మార్చుకుంటూ ఉంటాయి. కులశేఖరపట్టినం స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించే రాకెట్లకు ఆ పని ఉండదు. ఎందుకంటే అవి నేరుగా దక్షిణం వైపుగా దూసుకెళ్తాయి. ఫలితంగా ఇక్కడి నుంచి ప్రయోగించే శాటిలైట్ వాహక రాకెట్లకు ఇంధనం కూడా తక్కువగా కాలుతుంది. రాకెట్లు మోసుకెళ్లే పేలోడ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన టర్న్ అరౌండ్ సమయం కూడా తగ్గిపోతుంది. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వల్ల తమిళనాడులో ఎంతోమందికి ఉద్యోగాలు కూడా లభించనున్నాయి.