పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం కేవలం చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాకుండా, ఇప్పుడు తాగునీటి బాటిళ్ల మార్కెట్‌ను కూడా కుదిపేస్తోంది. దేశంలో దాదాపు రూ.46,000 కోట్ల (5 బిలియన్ డాలర్ల) మార్కెట్ కలిగిన ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమ ప్రస్తుతం ముడిసరుకు ధరల భారంతో సతమతమవుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడంతో, ప్లాస్టిక్ బాటిళ్ల తయారీకి వాడే పాలిమర్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో పాలిమర్ ధర ఏకంగా 50 శాతం పెరిగి రూ.170కు చేరగా, బాటిల్ మూతలు, లేబుల్స్, ప్యాకింగ్ బాక్సుల ధరలు కూడా రెట్టింపయ్యాయి.
వేసవి కాలం ప్రారంభమైన తరుణంలోనే ఈ ధరల పెరుగుదల సంభవించడం వినియోగదారులకు పెద్ద షాక్ అని చెప్పాలి. బాటిల్ తయారీలో వాడే ముడి పదార్థాల ధర పెరగడంతో, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 2,000 తయారీ సంస్థలు ఇప్పటికే రీసెల్లర్లకు బాటిల్‌పై ఒక రూపాయి అదనంగా పెంచేశాయి. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరో 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ‘ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్’ వెల్లడించింది. ప్రస్తుతం మార్కెట్‌లో లీటర్ బాటిల్ రూ.15 నుంచి రూ.20 వరకు పలుకుతుండగా, మరో నాలుగైదు రోజుల్లో ఇది సామాన్య వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపనుందని అసోసియేషన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
భారతదేశం వంటి భారీ జనాభా కలిగిన దేశంలో 70 శాతం భూగర్భ జలాలు కలుషితమయ్యాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, సురక్షితమైన తాగునీటి కోసం సామాన్యుడు ప్యాకేజ్డ్ వాటర్ బాటిళ్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాడు. బిస్లరీ, కిన్లీ, అక్వాఫినా వంటి దిగ్గజ సంస్థలతో పాటు స్థానిక కంపెనీలు ఈ మార్కెట్‌లో పోటీ పడుతున్నాయి. ఇప్పుడు యుద్ధం కారణంగా ప్లాస్టిక్ తయారీ వ్యయం పెరగడం, అటు ఎండాకాలం కారణంగా డిమాండ్ పెరగడం వంటి పరిణామాలు నీటి బాటిల్‌ను విలాసవస్తువుగా మార్చే ప్రమాదం కనిపిస్తోంది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా, దాని సెగలు మాత్రం ఇక్కడ సామాన్యుడి దాహాన్ని తీర్చే నీటి సీసా ధర వరకు పాకడం గమనార్హం.
