Anjali Birla : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె, ఐఆర్‌పీఎస్ అధికారిణి అంజలీ బిర్లా(Anjali Birla) ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి ఓంబిర్లా ఇన్‌ఫ్లూయెన్స్ వల్లే యూపీఎస్సీ పరీక్ష రాసిన మొదటిసారే తాను సివిల్స్‌కు ఎంపికయ్యానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టారు. ఇలాంటి తప్పుడు ప్రచారం వల్ల ఓంబిర్లా(Om Birla) కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని పిటిషన్‌లో అంజలీ బిర్లా ప్రస్తావించారు. తప్పుడు సమాచారంతో ట్విట్టర్ సహా సోషల్ మీడియా ఖాతాలలో పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆమె కోరారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘ఆ సోషల్ మీడియా పోస్టులు నా ప్రతిష్ఠను దెబ్బతీసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేసేలా ఉన్నాయి’’ అని అంజలీ బిర్లా ఆరోపించారు. నిరాధారంగా తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఆమె ఖండించారు. ఈ దుష్ప్రచారం వల్ల తన వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతోందని పిటిషన్‌లో అంజలి ప్రస్తావించారు. ఈ వ్యవహారంలో ప్రతివాదులుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, గూగుల్, ఎక్స్ కార్ప్(ట్విట్టర్), గుర్తుతెలియని సోషల్ మీడియా ఖాతాల నిర్వాహకులను ఆమె చేర్చారు. అంజలీ బిర్లా తరఫున సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ ఈ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసర జాబితాలో చేర్చి.. ఇవాళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్ చావ్లా సారథ్యంలోని ధర్మాసనం విచారించింది.
Also Read :Union Budget 2024 : మహిళల పేరిట ఆస్తులు కొంటే ఆ బెనిఫిట్.. బడ్జెట్‌లో కీలక ప్రకటన
ఇదే అంశంపై ఇటీవల మహారాష్ట్ర సైబర్ సెల్ పోలీసులకు అంజలీ బిర్లా ఫిర్యాదు ఇచ్చారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ట్విట్టర్ అకౌంట్ల సమాచారాన్ని ఆమె పోలీసులకు అందించారు. ఆ అకౌంట్ల నిర్వాహకులపై భారత న్యాయ సంహితలోని సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జులై 5న ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఆయా అకౌంట్ల నిర్వాహకులను గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.