Bomb Threats : విమానాలకు బెదిరింపులు ఎంతకూ ఆగడం లేదు. తాజాగా ఇవాళ ఆకాశ ఎయిర్, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకు ఆకాశ ఎయిర్ విమానం(QP 1335) బయలుదేరిన కాసేపటికే.. అందులో బాంబు ఉందంటూ బెదిరింపు వచ్చింది. దీంతో విమానం వెంటనే న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చేసింది. ఈవిషయాన్ని ఆకాశ ఎయిర్ (Bomb Threats) సంస్థ కూడా ధ్రువీకరించింది. బాంబు బెదిరింపును ఎదుర్కొన్న తమ విమానంలో ముగ్గురు శిశువులు, ఏడుగురు సిబ్బంది సహా 174 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపింది.
Also Read :YouTube Features : యూట్యూబ్‌లో మరింత కంఫర్ట్‌గా ‘మినీ ప్లేయర్’.. ‘స్లీప్ టైమర్’ను వాడేసుకోండి
ఇక ఇవాళ ఉదయం ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో మార్గం మధ్యలోనే ఈ విమానాన్ని గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానాన్ని ఆపి, వెంటనే ప్రయాణికులను దింపేశారు. విమానంలో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. గత రెండు రోజుల్లో ఇండిగో విమానయాన సంస్థకు వచ్చిన రెండో బెదిరింపు ఇది.
Also Read :Smallest Washing Machine : ప్రపంచంలోనే అతిచిన్న వాషింగ్ మెషీన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
మొత్తం మీద గత 48 గంటల వ్యవధిలో పది విమానాలకు సోషల్ మీడియా ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా సంస్థలు పలు విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశాయి. విమానాలు బయలుదేరే ముందు.. వాటిలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనలతో విమాన ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా మన దేశంలో రైళ్లకు వరుస బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే తమిళనాడులో చెన్నై సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఎంతోమంది గాయపడ్డారు. ఇప్పుడు విమానాలకు వరుస బెదిరింపులు వస్తున్నందున.. వాటికి ఎలాంటి అపాయం జరుగుతుందో అన్న ఆందోళన అలుముకుంది. అయితే ఈవిధంగా విమానాలకు వస్తున్న బెదిరింపు సందేశాల్లో చాలావరకు నకిలీలే ఉన్నాయని వెల్లడవుతోంది. కొంతమంది ఆకతాయిలు ఆటపట్టించడానికి ఇలాంటి మెసేజ్‌లు, ఈమెయిల్స్ పంపుతున్నారు.