Adani: 3 ఏళ్లలో 10 లక్షల కోట్లు, అదానీ అక్రమ సామ్రాజ్య నిర్మాణం

ప్రపంచంలో మూడో ధన వంతునిగా పేరు తెచ్చుకున్న అదాని భారత్ లో అత్యధిక పన్ను చెల్లించే 15 మందిలో లేరు అనేది పచ్చి వాస్తవం. అసలు ఎవరు ఈ ఆదానీ?

  • Written By:
  • Publish Date - March 5, 2023 / 11:39 AM IST

ప్రపంచంలో మూడో ధన వంతునిగా పేరు తెచ్చుకున్న అదాని భారత్ లో అత్యధిక పన్ను చెల్లించే 15 మందిలో లేరు అనేది పచ్చి వాస్తవం. అసలు ఎవరు ఈ అదానీ? (Adani) 10 తరగతి పాఠశాల విద్యార్ధి దశలోనే డుమ్మా కొట్టి గుజరాత్ లో కామర్స్ డిగ్రీ కోర్స్ లో చేరి రెండో ఏడాది మాని వేసాడు. వజ్రాల వ్యాపారి వద్ద కొంత కాలం పనిచేసి 1981 లో అహ్మదాబాదు చేరాడు. బంధు వొకరు పి వి సి వ్యాపారం చేస్తుంటే అందులో చేరాడు. 1988 లో అదానీ (Adani) స్పోర్ట్స్ పేరిట క్రీడా రంగంలో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. క్రీడలు అనగానే యువకులు ఆకర్షితు లవుతారు. ఎక్స్ పోర్ట్స్ పేరిట ఎగుమతుల వ్యాపారం మొదలు పెట్టాడు. గుజరాత్ రాజకీయాల్లో పెట్టుబడులు పెట్టాడు. గుజరాత్ మారణ హోమం కాలంలో మోదీని తొలగించాలని వాజ్ పాయ్ పై వత్తిడి వచ్చింది. అప్పుడు మోదీకి అండగా నిలబడ్డాడు అదాని . గుజరాత్ వ్యాపారుల సంఘాన్ని చీల్చి, ఆ గ్రూప్ ఆధ్వర్యంలో వైబ్రంట్ గుజరాత్ పేరిట శిఖరాగ్ర సదస్సును నిర్వహించడంలో ఆదానీ సర్వం తానై చూసుకున్నాడు. మోదీ చుట్టూతా బలమైన వ్యాపార వర్గాన్ని నిలిపాడు అదానీ (Adani). గుజరాత్ అభివృద్ధి నమూనా అనే ఒక కాల్పనిక జగత్తును సృష్టించాడు. అదే గుజరాత్ పార్ములాగా పేరొందింది. దాన్ని ఫేక్ మీడియా ద్వారా ప్రమోట్ చేసాడు.

ఇదే మోదీ 2014 లో ప్రధానిగా నిలబెట్టడానికి ఉపయోగ పడింది. ఇదే సంస్థ అదాని ద్వారా మోదీకి అండగా నిలబడి ఎన్నికల ఖర్చు భరించింది. మీడియాను మేనేజ్ చేసి మోదీకి విపరీతమైన ప్రచారం కల్పించాడు. మోదీని అందరూ ఒక అంటరాని వ్యక్తిగా చూసే కాలంలో మోదీని ఆదుకుని రాజకీయ యవనికపై నిలబెట్టాడు. అదే మోదీ – అదాని మైత్రి కి బలమైన బంధాన్ని వేసింది. 2002 – 14 మద్య వరకూ మోదీ అదానీ (Adani) ని బలపరుస్తూ వస్తూనే ఉన్నాడు . ముంద్రా పోర్ట్ చుట్టూ ఉన్న 18,375 ఎకరాల భూమిని చదరపు మీటరు రూపాయి చొప్పున అంటే ఎకరా 3,200 రూపాయకు ఆదానీ సంస్థకు కేటాయించారు. ఇదే భూమిని అదాని పారిశ్రామిక వేత్తలకు చదరపు మీటరును ఇరవై రెట్లు ఎక్కువ అద్దెకు ఇచ్చాడు. అలాగే ఎస్.ఇ.జెడ్ లకు కేటాయించిన వేలాది ఎకరాల భూమికి స్టాంపు డ్యూటీ మినహాయించింది ప్రభుత్వం. ఈ భూముల్లో పర్యావరణా నిబంధనలు, గిరిజన చట్టా లను అతిక్రమించిందని యు.పి.ఎ ప్రభుత్వం 200 కోట్లు జరిమానా విధించింది. అవినీతిలో కూరుకు పోయిన కాంగ్రెస్ మీద ఏవగింపుతో 2014 లో మోదీకి ఓటు వేసారు. మోదీ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన జరిమానా రద్దుపర పించుకున్నాడు అదాని. ఇక అందలం ఎక్కిన బి.జె.పి మోదీ ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీని , చమురు మీద రాయితీలను క్రమ క్రమంగా ఎత్తి వేసింది. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోయింది, నేటికీ వాటి ధరలు తగ్గించగుండా లక్షల కోట్లు ప్రభుత్వం సంపాదించింది. ఆ డబ్బును కార్పొరేట్ వ్యాపారు లకు ఋణాల రద్దుకు, ఎగవేత దారులకు రాయితీల పేర 12 లక్షల కోట్లు దోచి పెట్టింది.

పారు బాకీల కింద రద్దు చేయించుకున్న కార్పొరేట్ సంస్థల పెద్దలు 28 మందిలో ఒక్క విజయ్ మాల్యా మాత్రమే బైటి వ్యక్తి . మిగతా వారంతా గుజరాతీయులే. ఇదే మోదీ గుజరాత్ బ్రాండ్. మొత్తం జాతి సంపదను గుజరాత్ వారికి దోచి పెడుతున్నాడు . 2021- 22 లో 14.8 లక్షల కోట్లు జి.ఎస్.టి వల్ల రాబడి ఉంటే ఇదంతా 62 % మంది బడుగు, బలహీన, మద్య తరగతి వారు కట్టారు. కేవలం సంపన్న వర్గాలు 3 % పన్ను మాత్రమే కట్టారు. అంటే పేదలను కొట్టి సంపన్నులకు పెడుతోంది. అంటే కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లు . ప్రభుత్వ సంస్థల్లో భారీ లాభాలు ఉండక పోవచ్చు. కానీ పన్నులు నూరు శాతం కడతారు. అదే ప్రైవేటు సంస్థలు ఎగ్గొడతానికి ప్రయత్నిస్తాయి . దానితో దేశం దివాళా తీస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్ని ఎక్కువ ఉంటే దేశ ఆర్ధిక వ్యవస్థ అంత బలంగా ఉన్నట్లు. దేశ ఆస్తులను ప్రైవేటు సంస్థలను కట్టబెడుతున్నారు అంటే దేశాన్ని అమ్మివేస్తున్నట్లు లెక్క. హిట్లర్ , ముస్సోలినీ లాంటి వారు జాతికి చేసిన నష్ఠం పూడ్చడానికి దశాబ్ధాలు పట్టింది. మరి మోదీ చేస్తున్న ఈ దోపిడీకి కోలుకోవడానికి ఎన్ని ఏళ్ళు పడుతుందో మరి . ప్రఖ్యాత ఆర్ధికవేత్త అమార్త్య సేన్ గతంలోనే మోదీ పాలన గురించి హెచ్చ రించారు. 2009 లో సత్యం రామలింగ రాజు కుంభకోణం 8 వేల కోట్లు. దానికే ఏడు సం.లు జైలు శిక్ష పడింది. 14 సం.లు సెక్యూరిటీ మార్కెట్ రంగంలోకి కాలు మోప నీయలేదు. మరి అదే శిక్ష ఆదానీకి వెయ్యాలి అంటే 7 వందల ఏళ్ల శిక్ష పడుతుందట సెబీ లెక్కల ప్రకారం. 14 వందల ఏళ్ల షేర్ మార్కెట్ లోకి అడుగు పెట్టకూడదట. 30 ఏళ్లుగా మనీ లాండరింగ్ కు పాల్పడుతున్న అదానీ (Adani) ని అరెస్ట్ చేసి , శిక్ష వేయించే దమ్ము మోదీకి ఉందా? 12 లక్షల కోట్లు సంపాదిస్తే 10 లక్షల కోట్లు గత మూడు ఏళ్లలోనే సంపాదించాడు. అదాని సంస్థలో 22 మంది డైరక్టర్లు ఉంటే 8 మంది కుటుంబ సభ్యులే. అన్న వినోద్ అదాని 38 షెల్ సంస్థలు పెట్టి డబ్బు తరలించాడు.

ఇంకో సోదరుడు 1700 కోట్లు కాజేసాడని , సంతకాలు ఫోర్జరీ చేసాడని, నాలుగు సార్లు దర్యాప్తు చేసి , రెండు సార్లు అరెస్ట్ చేసారు. బావ వజ్రాల వ్యాపారంలో అక్రమాలు చేసాడని అరెస్ట్ అయ్యాడు. అన్నిటిలోనూ చాలా తక్కువ మొత్తంలో ఫైన్ లు వేయించుకుని తప్పించుకునే వారు. వజ్రాల వ్యాపారంలో ముడి వజ్రాలని విదేశాల నుండీ దిగుమతి చేసుకుని , ఆభరణాలు చేసి మరలా ఎగుమతులు చేయడానికి లైసెన్సు పొంది , అసలు దిగుమతులు చేసుకోకుండా, అన్నీ కాగితాల మీద దొంగ లెక్కలు చూపించి, తయారు చేయకుండా ఎగుమతులు చేస్తున్నట్లు దొంగ కాగితాలు సృష్టించే వారట. అయితే ఏమిటి ఉపయోగం అంటే ఆ రోజుల్లో ప్రభుత్వం ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇచ్చింది . అలా 680 కోట్లు ప్రోత్సాహక రాయితీలు పొందారట. ఈ డబ్బు ఎవరిది , ప్రభుత్వానికి సామాన్యులు టాక్సులు కట్టిన ధనం అది. ఏదీ ఉత్పత్తి చేయ కుండానే ప్రజాధనాన్ని లూఠీ చెయ్యడం . ఇప్పటికీ అదాని అదే విధానాన్ని అనుసరిస్తు న్నాడు. ఏ సంస్థనూ స్థాపించడు , వస్తు ఉత్పత్తి చేయడు. ఇతరులు సంపా దించిన సంస్థలను బెదిరించి లాక్కుంటాడు. ప్రభుత్వ సంస్థలను దోచుకుంటాడు. అన్నీ అద్దె ప్రాతిపదికనే సొంతం చేసుకుంటాడు. టాటా, బిర్లా , అంబానీ లాంటి వారి సంస్థల్లో లక్షలాది మంది పనిచేస్తారు. అదే ఆదానీ సంస్థల్లో కేవలం వందల మంది మాత్రమే పనిచేస్తారు. ఇతరుల ప్రైవేటు పోర్టులను కాజేయడం, ప్రభుత్వ నౌకాయాన పోర్టులు, విమానయాన సంస్థలను , ఇతర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలను కారు చవకగా ఆక్రమించడం , కొనడం చేస్తూ ఉంటాడు. 28 దేశాలతో 30 రకాల సరుకుల వాణిజ్యాన్ని, ఆదానీ పోర్ట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. కేతన్ పరేక్ లాంటి పన్నుల ఎగవేత దారులు , పరారీ దారులు ఆదానీకి సహచరులు. ఇదొక పెద్ద దోపిడీ ముఠా. ఈ దోపిడీ ముఠాకు నాయకుడు ఈ ఆదానీనే అట. అలాగే సోలార్ విద్యుత్ పరికరాలను చౌకగా కొని, బిల్లుల్లో ఏడెమిది రెట్లు ఎక్కువ ధరకు కొన్నట్లు చూపించి, దాని మీద కొంత లాభం వేసుకుని, యూనిట్ కు ఇంత ధర అని ప్రభుత్వా నికి సరఫరా చేస్తున్నాడు. మోదీ అండతో తను అనుకున్న ధరను విద్యుత్ సంస్థల నుండి పిండు కుంటున్నాడు.

ఆ విద్యుత్ సంస్థలు ఆ ధరను మన నెత్తిన వేస్తున్నాయి. అలాగే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు పదిశాతం బొగ్గును ఆదానీ దగ్గర కొనవలసిందే. అలా ప్రభుత్వాలతో ఒప్పందం చేసుకుంటాడు. పోనీ ఆ బొగ్గు ఏమన్నా తక్కువ ధరకు వస్తుందా అంటే సింగరేణిలో దొరికే బొగ్గు కన్నా రెండింతలు ఎక్కువ ఉంటుంది. అలా పెంచి కొన్న ధరలను విద్యుత్ సంస్థలు ట్రూ అప్ చార్జీల పేర మన నెత్తిన వేస్తాయి. ఇక షేర్ల మార్కెట్ లో తన సంస్థల షేర్ల ధరలను వందల రెట్లు పెంచి చూపించాడు. పెంచిన ధరలు చూపించి బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నాడు. అలాగే విదేశీ సంస్థలకు బాండ్లు అమ్మాడు. 35 % బ్యాంకర్లు, 35% విదేశీ సంస్థలు మదుపర్లుగా మారారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. షేర్లలో షార్ట్ సెల్లింగ్ వ్యాపారం చేసే సంస్థలు ఉన్నాయి. హిండెన్ బర్గ్ అనే సంస్థ కూడా షార్ట్ సెల్లింగ్ చేసే సంస్థ. అది దిన దిన ప్రవర్ధ మానమై దూసుకు పోతున్న ఆదానీ సంస్థలపై దృష్ఠి సారించి లోతుగా విషయ సేకరణ చేయగా, గుండె గుబేల్ మంది. అదే విషయాన్ని విదేశీ మదుపర్లకు ఉప్పు అందించాడు. అలా బుడగ పేలింది.

విశాఖ ఓడ రేవు లో ఒక బెర్త్ తీసుకున్నాడు 145 కోట్ల అద్దె ప్రాతిపదికిన. బెర్త్ నిర్మించ గుండానే బ్యాంకులో 350 కోట్లు అప్పు తీసుకున్నాడు. బ్యాంకు కిస్తీలు కట్టమని అడిగితే పోర్ట్ నాకు నష్టాలు వస్తున్నాయి, నేను వదిలేసాను అన్నాడు . మరి 350 కోట్లు ఎవరు ఇవ్వాలి ? బ్యాంకులు విశాఖ పోర్ట్ మీద పడ్డాయి . అప్పుడు పోర్ట్ మీద నా రైడ్స్ వదిలేసుకుంటాను , మీ తిప్పలు మీరు పడండి అంటున్నాడు. ఈ లోపు పోర్ట్ వ్యాపారం మొత్తం గంగవరం పోర్ట్ కు మార్పించాడు అదాని. అక్కడ గంగవరం పోర్ట్ ను ఆక్రమించి కూర్చున్నాడు.అలా విశాఖ పోర్ట్ ను సర్వనాశనం చేసాడు. అలాగే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మింగేందుకు తయారుగా ఉన్నాడు. ఇదీ అదాని అక్రమాల సామ్రాజ్యంలోని సంపద సీక్రెట్. దీనికి దేశభక్తిని జోడిస్తే ఇక భారత్ ను కాపాడే వాడు ఎవరు? అనేది మీరే ఆలోచించాలి.

Also Read:  Names: ఈ ఊరిలో ఎక్కువగా ఈ పేర్లే ఉంటాయి.. ఇంతకీ ఆ ఊరేంటి? ఆ పేర్లేంటి?