Pushpa Dialogue Horror : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్ జిల్లా సిపత్ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కోపోద్రిక్తుడైన 16 ఏళ్ల మైనర్ బాలుడు తుపాకీ చేతపట్టి.. పుష్ప డైలాగ్ చెప్పాడు. అంతటితో ఆగకుండా అదే తుపాకీతో ఫైరింగ్ చేశాడు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి.
Also Read :Trump Truth Social : ట్రంప్ కంపెనీ సీఈఓకు కూడా ప్రభుత్వంలో పదవి.. ఎందుకు ?
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 13వ తేదీన రాత్రి సిపత్ పట్టణంలోని ఒక ఇంట్లో 16 ఏళ్ల బాలుడు, అతడి మేనమామ మధ్య వాగ్వాదం జరిగింది. ఇద్దరూ దాదాపు అరగంట పాటు ఒకరినొకరు తిట్టుకున్నారు. దీంతో ఇరుగుపొరుగు వారు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఇంతలో కోపోద్రిక్తుడైన మైనర్ బాలుడు అక్కడి నుంచి పరుగెత్తి.. తన ఇంటికి వెళ్లాడు. తన ఇంట్లో తగిలించి ఉన్న తుపాకీని తీసుకొచ్చి పుష్ప సినిమా డైలాగులు చెప్పాడు. ‘‘పుష్ప అంటే పువ్వు అనుకుంటున్నావా ? నేను పువ్వును కాదు ఫైర్‌ను’’ అని బాలుడు డైలాగ్స్ విసిరాడు. అనంతరం విచక్షణారహితంగా ఫైరింగ్ చేశాడు. అయితే అతడు తుపాకీని కంట్రోల్ చేయలేకపోయాడు. ఫైరింగ్ చేసిన వెంటనే తుపాకీ నేల వైపుగా వంగిపోయింది. దీంతో లక్కీగా తుపాకీ గుండ్లు నేలను తాకాయి. నేలను వేగంగా తాకిన తుపాకీ గుండ్లు.. అక్కడి నుంచి ఎగిరి సమీపంలోనే నిలబడిన సదరు బాలుడి నానమ్మను, ఆశిష్ షికారీ అనే యువకుడిని తాకాయి. దీంతో వారిద్దరికీ తీవ్ర రక్తస్రావమైంది.
Also Read :Delhi Elections 2025: ఆప్ మరో జాబితా.. కాంగ్రెస్ కంచుకోటలో కేజ్రీవాల్ పోటీ
సిపత్ పట్టణ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సదరు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ఫైరింగ్‌కు వాడిన తుపాకీని(Pushpa Dialogue Horror) సీజ్ చేశారు. అది సదరు బాలుడి తాతయ్యకు చెందిన తుపాకీ అని దర్యాప్తులో తేలింది. 1987లో నాటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సదరు బాలుడి తాతయ్యకు గన్ లైసెన్స్ జారీ అయిందని వెల్లడైంది. ఆ తుపాకీని దుర్వినియోగం చేస్తున్నందున.. దాని లైసెన్సును రద్దు చేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు పోలీసులు లేఖ పంపారు. తుపాకీ కాల్పుల్లో కుడి చేతికి గాయమై బాధపడుతున్న యువకుడు ఆశిష్ షికారీ ఫిర్యాదు మేరకు పోలీసులు మైనర్ బాలుడిపై భారత న్యాయ సంహితలోని 110 సెక్షన్ ప్రకారం అభియోగాలను నమోదు చేశారు.