26/11 Mumbai Attacks : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముంబయి ఉగ్రదాడి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌కు అప్పగిస్తున్నామంటూ ట్రంప్ విలేకరులతో అన్నారు. అంతేకాదు మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ట్రంప్ హెచ్చరించారు.
Read Also: Trump Praises PM Modi: ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
ఇక, ఈ ప్రకటనపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబయి ఉగ్రదాడి నేరస్థుడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 64 ఏళ్ల తహవూర్ రాణా పాకిస్థాన్ మూలాలతో ఉన్న కెనడా పౌరుడు. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారిగా అతడిని గుర్తించారు. ప్రస్తుతం రాణా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడిని భారత్‌కు అప్పగించాలని భారత్ గత కొంతకాలంగా అమెరికాను కోరుతోంది. భారత ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి అమెరికా గతంలోనే సానుకూలంగా స్పందించింది.
తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. ఆయా న్యాయస్థానాలు అతడి అభ్యర్థనను తిరస్కరించాయి. శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరి ప్రయత్నంగా గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దీన్ని కొట్టివేయాలని అమెరికా ప్రభుత్వం న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తూ.. 20 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు రాణా అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో అతడిని భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. తాజాగా రాణా అప్పగింతపై ట్రంప్ ప్రకటన చేశారు. దీంతో మరికొన్ని నెలల్లోనే అతడిని భారత్‌కు అప్పగించే అవకాశాలున్నాయి.
Read Also: Valentine’s Day : ప్రేమను నిరాకరించిందని యువతిపై యాసిడ్ దాడి