ఉదయం పరగడుపున నీళ్లు తాగితే అద్భుతాలే!!

చర్మం తగినంత హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ముఖంపై సహజమైన మెరుపు రావడమే కాకుండా చర్మ కణాలు త్వరగా రిపేర్ అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కని మార్గం.

Published By: HashtagU Telugu Desk
Water

Water

Water: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది అనడానికి ఉదయం పూట మనం పాటించే చిన్న చిన్న అలవాట్లే నిదర్శనం. నీరే జీవాధారం అని తెలిసినప్పటికీ చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే వేడివేడి టీ లేదా కాఫీలతో రోజును ప్రారంభిస్తుంటారు. కానీ ఆయుర్వేద నిపుణుల‌ అభిప్రాయం ప్రకారం.. ఇది సరైన పద్ధతి కాదు. ఆయుర్వేదంలో ‘ఉషాపానం’ లేదా ‘అమృతపానం’ అని పిలిచే ఈ అద్భుతమైన ప్రక్రియను ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. అంటే ఉదయం నిద్రలేవగానే కనీసం ఒక గ్లాసు లేదా అంతకంటే ఎక్కువ నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ శుభ్రపడటమే కాకుండా రోజంతా మన శరీరం చురుగ్గా ఉండేలా మెటబాలిజం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చాలామందికి బ్రష్ చేయకుండా నీళ్లు తాగడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా పొట్టలోకి వెళ్లి ఇబ్బంది కలిగిస్తుందేమో అన్న సందేహం ఉంటుంది. అయితే మన పొట్టలో ఉండే శక్తివంతమైన యాసిడ్ల ముందు ఆ బ్యాక్టీరియా ఏమాత్రం నిలవలేదని, నీటి ద్వారా పొట్టలోకి చేరగానే అవి నశిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ వంటి సమస్యల నుండి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది మన కిడ్నీలను, లివర్‌ను శుభ్రం చేసి రక్తంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Also Read: టీడీపీ Vs జనసేన ప్రోటొకాల్‌ రగడ

కేవలం అంతర్గత ఆరోగ్యం మాత్రమే కాకుండా మన బాహ్య సౌందర్యానికి కూడా నీరు గొప్ప ఔషధంగా పనిచేస్తుంది. చర్మం తగినంత హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల ముఖంపై సహజమైన మెరుపు రావడమే కాకుండా చర్మ కణాలు త్వరగా రిపేర్ అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక చక్కని మార్గం. ఎందుకంటే ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నా, కణాల పనితీరు మెరుగుపడాలన్నా ఉదయం నిద్రలేవగానే నీళ్లు తాగడాన్ని మించిన సులువైన మార్గం మరొకటి లేదు. కాబట్టి రేపటి నుండి మీ రోజును ఒక గ్లాసు నీటితో ప్రారంభించి, మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి.

 

  Last Updated: 22 Apr 2026, 12:52 PM IST