Onions: పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా బిజీగా సాగుతున్న ఎన్నికల ర్యాలీల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సరదా సందర్భంలో కనిపించారు. ఝార్‌గ్రామ్‌లో ఆగి ఆయన ఝల్‌మూరి రుచి చూస్తుండగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఒక దుకాణదారుడు ప్రధానిని “మీరు ఉల్లిపాయ తింటారా?” అని అడగ్గా ఆయన చిరునవ్వుతో “అవును, ఉల్లిపాయ తింటాను” అని సమాధానం ఇచ్చారు. ఈ చిన్న సంభాషణ ఇప్పుడు ప్రజల మధ్య ఆసక్తికరమైన చర్చాంశనీయంగా మారింది.
భారతీయ ఆహారంలో అంతర్భాగం
నిజానికి భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ ఒక ముఖ్యమైన భాగం. కూర అయినా, సలాడ్ అయినా లేదా చట్నీ అయినా.. ఉల్లిపాయ లేనిదే రుచి పూర్తి కాదు. చాలా మంది దీనిని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు. అయితే పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి మంచిదేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే పరిమిత పరిమాణంలో తిన్నప్పుడే పచ్చి ఉల్లిపాయ ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉల్లిపాయ వల్ల కలిగే ప్రయోజనాలేమిటి?
నివేదికల ప్రకారం.. పచ్చి ఉల్లిపాయలో విటమిన్ సి, విటమిన్ బి6, ఫోలేట్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తినిస్తాయి. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి డైట్‌లో చేర్చుకోవడానికి ఇది మంచి ఎంపిక.
Also Read: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ప్రకటన!
రోగనిరోధక శక్తికి మేలు: రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉల్లిపాయ పాత్ర పెద్దది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ముఖ్యంగా ‘క్వెర్సెటిన్’, శరీరం ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. వాపును తగ్గిస్తాయి. అందుకే క్రమం తప్పకుండా కొద్ది మొత్తంలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మెరుగుపడుతుంది.
గుండె ఆరోగ్యానికి: గుండె ఆరోగ్యానికి కూడా ఉల్లిపాయ మేలు చేస్తుందని భావిస్తారు. ఇందులోని మూలకాలు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, రక్తపోటును సమతుల్యం చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో పచ్చి ఉల్లిపాయ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ‘ప్రీబయోటిక్ ఫైబర్’ ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాకు పోషణనిస్తుంది. తద్వారా గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఇది బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు మేలు చేస్తుంది.
దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా?
ఏదైనా సరే అతిగా తీసుకుంటే నష్టం కలిగించవచ్చు. పచ్చి ఉల్లిపాయను అతిగా తినడం వల్ల కొందరికి గ్యాస్, కడుపులో మంట లేదా నోటి దుర్వాసన వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో అలర్జీలు లేదా మందులతో ప్రతిచర్యలు కూడా కనిపించవచ్చు. కాబట్టి దీనిని పరిమితంగా తీసుకోవడమే ఉత్తమం.
