Ayurvedic Remedies: తప్పుడు ఆహారపు అలవాట్లు, అతిగా మసాలాలు ఉన్న పదార్థాలు లేదా బయటి ఆహారం తినడం వల్ల తరచుగా కడుపు పాడవుతుంది. దీనివల్ల విరేచనాలు (మోషన్స్), కడుపు నొప్పి, కడుపులో తిప్పడం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదం ప్రకారం.. ఈ సమస్యలు మన జీర్ణ అగ్ని (జీర్ణశక్తి) అసమతుల్యత వల్ల ఏర్పడతాయి. వీటిని సకాలంలో పట్టించుకోకపోతే నీరసం, డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) వంటి ఇబ్బందులు రావచ్చు. అటువంటప్పుడు తక్షణ ఉపశమనం కలిగించే 5 అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు- పటిక బెల్లం కషాయం
కడుపు పాడైనప్పుడు సోంపు- పటిక బెల్లం కషాయం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, పటిక బెల్లం కడుపులో మంటను తగ్గిస్తుంది. ఒక కప్పు నీటిలో ఒక స్పూన్ సోంపు, కొంచెం పటిక బెల్లం వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టి తాగాలి. దీనివల్ల గ్యాస్, కడుపు నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: టీ20 వరల్డ్ కప్.. భారత్-పాక్ మ్యాచ్ జరగకుంటే రూ. 4,500 కోట్ల నష్టం?!
అల్లం- తేనె
ఆయుర్వేదంలో అల్లం పొట్ట సమస్యలకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది వాపును తగ్గించి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అర స్పూన్ అల్లం రసంలో ఒక స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకోవాలి. దీనివల్ల కడుపులో మలమల తిప్పడం, కడుపు ఉబ్బరం తగ్గుతాయి.
పుదీనా- కొత్తిమీర రసం
పుదీనా కడుపుకు చల్లదనాన్ని ఇచ్చి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీర శరీరంలోని వ్యర్థాలను (టాక్సిన్స్) బయటకు పంపడానికి సహాయపడుతుంది. తాజా పుదీనా, కొత్తిమీర ఆకులను నీటితో కలిపి మిక్సీ పట్టి, వడకట్టి రోజుకు ఒకటి రెండు సార్లు తాగాలి.
పెరుగు- వాము
పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా (ప్రోబయోటిక్స్) పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. విరేచనాలు అయినప్పుడు పెరుగులో వాము కలుపుకుని తినాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు. అర కప్పు తాజా పెరుగులో చిటికెడు వేయించిన వాము పొడి, కొంచెం నల్ల ఉప్పు కలిపి తీసుకోవాలి. ఇది డయేరియా, కడుపు మంటను తగ్గిస్తుంది.
త్రిఫల చూర్ణం
ఉసిరి (ఆమ్లా), కరక్కాయ (హరడ్), తానికాయ (బహేడా) మిశ్రమమే ఈ త్రిఫల చూర్ణం. ఇది జీర్ణక్రియను బలోపేతం చేసి పొట్టను శుభ్రపరుస్తుంది. రాత్రి పడుకునే ముందు ఒక స్పూన్ త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. అయితే దీనిని వాడే ముందు ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
