Site icon HashtagU Telugu

Fact Check: ఢిల్లీలో భూకంపంతో కూలిన భవనాలు.. ఫొటోలు వైరల్

Fact Check 2015 Building Collapse 2025 Delhi Earthquake Shakti Collective Ptinews

Fact Checked By ptinews

ప్రచారం : ఢిల్లీ ఎన్‌‌సీఆర్‌ ప్రాంతంలో ఇటీవలే(2025 ఫిబ్రవరి 17న) సంభవించిన భూకంపంలో ఒక భవనం పాక్షికంగా కూలిపోయింది.

వాస్తవం : వైరల్ అయిన ఈ ఫోటో 2015 అక్టోబరు నాటిది. అప్పట్లో సంభవించిన భూకంపం వల్ల  దెబ్బతిన్న భవనం ఫొటో ఇది.

సోమవారం రోజు (ఫిబ్రవరి 17న) తెల్లవారుజామున ఢిల్లీ-ఎన్‌‌సీఆర్‌ ప్రాంతంలో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ భూకంపంలో ఒక భవనం పాక్షికంగా కూలిపోయిందంటూ  ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. PTI ఫ్యాక్ట్ చెక్ డెస్క్(Fact Check) ఈ ఫొటో గురించి దర్యాప్తు చేసింది. చివరకు.. ఈ  వైరల్ ఫోటో 2015 అక్టోబరు నాటిదని తేలింది. అప్పట్లో ఢిల్లీలో భూకంపం రావడంతో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. వాటిలో నుంచి ఒక ఇంటి ఫొటోను తీసుకొని..  తాజాగా 2025 ఫిబ్రవరి 17న చోటుచేసుకున్న భూకంపంలో దెబ్బతిన్న ఇల్లు ఇదే అంటూ తప్పుగా ప్రచారం చేశారని తేలింది.వాస్తవానికి ఆ ఫొటోకు, ఫిబ్రవరి 17న వచ్చిన ఢిల్లీ భూకంపానికి సంబంధం లేదని వెల్లడైంది.

Also Read :Sudan War : 3 రోజుల్లో 200 మంది మృతి.. సూడాన్‌లో రక్తపాతం

తప్పుడు ప్రచారం 

ఫిబ్రవరి 17న థ్రెడ్ యూజర్ ఒక పోస్ట్ పెట్టాడు.  ‘‘తాజాగా ఢిల్లీ భూకంపంలో పాక్షికంగా దెబ్బతిన భవనం ఇది’’ అంటూ ఒక ఫొటోను షేర్ చేశాడు. ‘‘ఢిల్లీ-ఎన్‌‌సీఆర్‌ ప్రాంతంలో భూకంపం. ఢిల్లీ-ఎన్‌‌సీఆర్ అంతటా ఫిబ్రవరి 17న ఉదయం 5:30 గంటలకు, ఆపై బిహార్‌లో ఉదయం 8 గంటలకు 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది’’ అని ఈ పోస్ట్‌లో సదరు వ్యక్తి రాశాడు. పోస్ట్ కి సంబంధించిన లింక్, ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉన్నాయి.

వాస్తవ తనిఖీ

ఈ ఫొటోను తొలుత గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా తనిఖీ చేశారు. దీంతో చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఇదే ఫొటోతో  ఢిల్లీ భూకంపంపై పెద్దసంఖ్యలో పోస్ట్‌‌లు పెట్టారని వెల్లడైంది. ఆ పోస్ట్‌లలో ఒకదానికి సంబంధించిన  లింక్ఆర్కైవ్ లింక్ ఇక్కడ ఉంది. సెర్చ్ ఫలితాలను మరింత స్కాన్ చేయగా.. 2024లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటిదే  ఒక ఫోటోను షేర్  చేశారని గుర్తించారు. ఆ పోస్ట్  లింక్ ఇక్కడ ఉంది. 

Also Read :Division Of Husband : మొదటి భార్య, రెండో భార్య.. ఓ భర్త సంచలన నిర్ణయం

ఈ ఫొటోకు సంబంధించిన మీడియా నివేదికల కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేశారు. దీంతో 2015 నవంబర్ 9న హిందూస్తాన్ టైమ్స్‌లో ప్రచురితమైన ఒక న్యూస్ రిపోర్ట్ కనిపించింది. “భూకంపంతో  భవనం కూలిపోవడం, దక్షిణ ఢిల్లీలో భయాన్ని రేకెత్తిస్తోంది” అని ఆ వార్తకు శీర్షిక పెట్టారు.  “సఫ్దర్‌జంగ్ ఎన్‌క్లేవ్‌లోని అనధికార కాలనీలో నాలుగు అంతస్తుల భవనం పాక్షికంగా కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న భవనాలపై కూడా డొమినో ప్రభావం ఉంటుందనే భయాన్ని రేకెత్తిస్తోంది” అని ఆ నివేదికలో వివరించారు. దాని లింక్ ఇక్కడ ఉంది.

ఈ వార్తలో కవర్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలాగే ఉందని డెస్క్ గుర్తించింది. 2015లో ఢిల్లీలో భూకంపం వచ్చినప్పుడు ప్రభావితమైన భవనం ఫొటోతోనే తప్పుడు  ప్రచారం చేశారని తేల్చింది.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ptinews వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది)