Hindu Heritage Month : ఇప్పటికే అమెరికాలోని పలు రాష్ట్రాలు అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెలగా ప్రకటించాయి. ఇప్పుడు ఆ జాబితాలో ఒహాయో రాష్ట్రం కూడా చేరింది. ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ వారసత్వ నెల(Hindu Heritage Month)గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు ఒహాయో స్టేట్ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఒహాయో రాష్ట్ర చరిత్రలో సెనేటర్‌గా ఎన్నికైన తొలి హిందువు నీరజ్ అంతానీ. ఏటా అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా జరుపుకునే బిల్లును ఆయనే సెనేట్‌లో ప్రవేశపెట్టారు. దీనిపై సెనేట్ సభ్యులను ఒప్పించడంలో నీరజ్ సక్సెస్ అయ్యారు. దీంతో ఆ బిల్లుకు ఆమోద ముద్ర పడింది. తదుపరిగా ఈ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపనున్నారు.
సెనేట్, స్టేట్ హౌస్ ఆమోదం తర్వాత రాష్ట్ర గవర్నర్ ఆమోదం లభించడం అనేది లాంఛనమే. అంటే దాదాపుగా బిల్లుకు లైన్ క్లియర్ అయినట్టే. ఇక నుంచి ప్రతి సంవత్సరం అక్టోబరు నెలలో ఆ రాష్ట్రంలోని హిందువులు అధికారికంగా వేడుకలు నిర్వహించుకోవచ్చు. అందుకు ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. తగినన్ని సెలవులు కూడా మంజూరవుతాయి. ఈసందర్భంగా నీరజ్ మాట్లాడుతూ.. ‘‘ఒహాయో రాష్ట్రంలో హిందువులు చేసిన కృష్టి వల్లే అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా గుర్తించారు. ఈ ప్రయత్నంలో నేను కూడాభాగస్తుడిగా మారినందుకు చాలా సంతోషంగా ఉంది. అమెరికాలో నివసించే హిందువులు అందరు సాధించిన విజయం ఇది’’ అని ఆయన తెలిపారు.
ఏటా అక్టోబరు నెలలో దసరా నవరాత్రులు, కర్వాచౌత్, ధన్ తేరస్, దీపావళి లాంటి ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి. అందుకే ఆ నెల హిందువులకు చాలా ముఖ్యమైనది. వరుసగా పండుగలు ఉన్నందు వల్లే ఆ నెలను హిందూ వారసత్వ మాసంగా పరిగణిస్తున్నారు. అక్టోబరు నెలలో వచ్చే తమ పండుగలను అధికారికంగా సెలబ్రేట్ చేసుకునే ఉద్దేశంతో .. దాన్ని హిందూ వారసత్వ మాసంగా ప్రకటించాలని అక్కడి చట్టసభలను హిందువులు కోరుతున్నారు. హిందూ వర్గాల ఈ డిమాండ్‌ను ఇప్పటికే చాలా అమెరికా రాష్ట్రాలు ఆమోదించాయి.