లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవీలను త్రిమాతృకలుగా భక్తులు భావిస్తూ కొలుస్తుంటారు. లక్ష్మీదేవి సిరిసంపదలను ప్రసాదిస్తుంది. పార్వతీదేవి స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. సరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. ఇలా ఈ ముగ్గురు అమ్మవార్లు భక్తులను అనుగ్రహిస్తుంటారు. వారిచేత పూజాభిషేకాలను అందుకుంటారు.
జీవితంలో చాలామంది సిరిసంపదలను కోరుకుంటారు. సిరిసంపదలతో వచ్చే భోగభాగ్యాలను అనుభవించాలని ఆశపడుతుంటారు. అందువల్లే లక్ష్మీదేవి అనుగ్రహం తమపై ఉండాలని ఆ తల్లికి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అయితే లక్ష్మీదేవి మాత్రం తనకు ప్రీతికరమైన వారిపైనే అనుగ్రహం చూపిస్తుందట. ఎవరైతే తమ ఇంటిని పవిత్రంగా, శుభ్రంగా ఉంచుకుంటారో, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతుంటారో, నిస్వార్థంగా వ్యవహరిస్తుంటారో, అసత్యం పలకుండా, అహంభావానికి దూరంగా ఉంటూ, తల్లిదండ్రులను, గురువులను పూజిస్తారో… అలాంటి వారి ఇంట్లో ఉండేందుకు, అలాంటి వారిని అనుగ్రహించడానికి లక్ష్మీదేవి సిద్ధంగా ఉంటుందనేది మహర్షుల మాట.
