Site icon HashtagU Telugu

Kanchi Kamakoti Peetam : కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగుతేజం.. గణేశశర్మ నేపథ్యమిదీ

Ganesha Sharma Kanchi Kamakoti Peetam andhra Pradesh Kanchipuram Tamil Nadu

Kanchi Kamakoti Peetam : తమిళనాడులోని సుప్రసిద్ధ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా 27 ఏళ్ల గణేశశర్మ ఎంపికయ్యారు. రుగ్వేద పండితుడైన ఈయన ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం వాస్తవ్యులు. ప్రస్తుతం కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్న శ్రీశంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఆయనను 71వ పీఠాధిపతిగా ఎంపిక చేశారు. విజయేంద్ర సరస్వతి ఈ నెల(ఏప్రిల్) 30న అక్షయ తృతీయ సందర్భంగా కాంచీపురం కామాక్షి అమ్మవారి ఆలయంలో గణేశశర్మకు సన్యాస దీక్ష ఇస్తారు. తన ఉత్తరాధికారిగా ప్రకటిస్తారు.  2018లో జయేంద్ర సరస్వతి మహాసమాధి అయ్యారు. దీంతో అప్పట్లో ఉత్తరాధికారిగా ఉన్న విజయేంద్ర సరస్వతి 70వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి ఆయనే కొనసాగుతూ వచ్చారు. గత ఆరు సంవత్సరాలుగా విజయేంద్ర సరస్వతి ఉత్తరాధికారి ఎంపిక వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు తాజాగా గణేశశర్మను ఎంపిక చేస్తూ ప్రకటన విడుదలైంది. కంచి కామకోటి మఠాన్ని ఆది శంకర(Kanchi Kamakoti Peetam) స్థాపించారు. ఇది తమిళనాడులోని కాంచీపురం నగరంలో ఉంది. ఆది శంకర భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో శాంతి, ప్రశాంతత శోధన కోసం ఇక్కడకు వస్తుంటారు.

Also Read :ACB Raids : కాళేశ్వరం మాజీ చీఫ్ ఇంజినీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

గణేశశర్మ నేపథ్యం 

  • కాకినాడ జిల్లా అన్నవరంలో గణేశశర్మ 1998లో జన్మించారు.
  • గణేశశర్మ పూర్తి పేరు..  సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశశర్మ ద్రావిడ్‌.
  • దుడ్డు ధన్వంతరి, మంగాదేవి దంపతుల పెద్ద కుమారుడే గణేశశర్మ.
  • గణేశశర్మ తండ్రి అన్నవరం ఆలయంలో మూడు దశాబ్దాలుగా ప్రథమశ్రేణి వ్రత పురోహితుడిగా ఉన్నారు.
  • గణేశశర్మ 2006లో వేద అధ్యయన దీక్ష తీసుకున్నారు. ద్వారకా తిరుమల ఆలయంలో వేదాలు, షడంగాలు, దశోపనిషత్తులు అభ్యసించారు.
  • తెలంగాణలోని బాసర జ్ఞాన సరస్వతి దేవస్థానం ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో సేవలు అందించారు.
  • గత కొన్నేళ్లుగా కంచి పీఠంలో గణేశశర్మ శాస్త్ర అధ్యయనం చేస్తున్నారు.
  • చిన్న వయసులోనే గణేశ శర్మకు ఇంత గొప్ప అవకాశం లభించడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.