Site icon HashtagU Telugu

Kailash Yatra: కైలాస మానస సరోవర యాత్ర.. అర్హతలు, ఖర్చులివీ

Kailash Mansarovar Yatra Lake Manasarovar china kailash Yatra  

Kailash Yatra: కైలాస పర్వతం.. హిందువులకు అత్యంత పవిత్రమైంది. దీన్ని శివ భగవానుడి నివాస స్థలంగా చెబుతారు. ఇది చైనా ఆక్రమిత టిబెట్‌లో ఉంది. చైనాలో కైలాస పర్వతాన్ని ‘మాపం యుమ్ త్సో’ అని పిలుస్తారు. చైనా, భారత్, నేపాల్‌ల ట్రై జంక్షన్‌లో దాదాపు 15,100 అడుగుల ఎత్తులో కైలాస పర్వతం ఉంది. దీనికి అత్యంత సమీపం నుంచే ఇండస్ (సింధూ), సట్లేజ్, బ్రహ్మపుత్ర, కర్ణాలీ అనే నాలుగు నదులు ప్రవహిస్తుంటాయి.  కైలాస పర్వతం వద్దే ఉన్న సరస్సును కైలాస మానస సరోవరం అని పిలుస్తారు. దీనికి హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, బోన్ మతాలలో చాలా ప్రాధాన్యత, ప్రాశస్త్యం ఉంది.  ఐదేళ్ల గ్యాప్ తర్వాత కైలాస మానస సరోవర యాత్ర మళ్లీ ప్రారంభం కాబోతుంది. ఎలా అప్లై చేయాలి ? ఫీజు ఎంత ? ఈ కథనంలో తెలుసుకుందాం..

ఈ అర్హతలు ఉంటేనే అప్లై చేయాలి

  • కైలాస మానస సరోవరం(Kailash Yatra) చాలా ఎత్తులో ఉంటుంది. అందుకే ఈ యాత్రకు ఎవరు పడితే వారిని అనుమతించరు.
  • 25 లేదా అంతకంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) ఉన్నవారినే ఈ యాత్రకు అనుమతిస్తారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నవారికే ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
  • విదేశీ పౌరులకు, ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డున్న వారు కూడా ఈ యాత్రకు అప్లై చేయలేరు. కేవలం భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నవారే ఈ యాత్రకు అప్లై చేయాలి.
  • 18 నుంచి 70 ఏళ్లలోపు వారికి ఈ యాత్రలో పాల్గొనే అవకాశం కల్పిస్తారు.
  • కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆన్‌లైన్‌లో మే 13 వరకు అప్లై చేయొచ్చని భారత విదేశాంగ శాఖ  ప్రకటించింది.
  • ఈ ఏడాది సెప్టెంబర్ 1 నాటికి కనీసం ఆరు నెలల వాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు ఉన్నవారే దరఖాస్తు చేయాలి. పాస్‌పోర్ట్ మొదటి పేజీ, చివరి పేజీ కాపీని సమర్పించాలి.
  • దరఖాస్తుదారుడు  ఫొటోను జేపీజీ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
  • ఒక అకౌంట్ నుంచి రెండు దరఖాస్తులనే నింపాలి.
  • కైలాస మానససరోవర యాత్రకు ఎంపికచేయడానికి కంప్యూటర్‌లో డ్రా తీస్తారు. ఎంపికైన వారికి ఈమెయిల్, మొబైల్ నెంబర్ ద్వారా సమాచారాన్ని తెలియజేస్తారు.
  • 011-23088133 హెల్ప్‌లైన్ నెంబర్ ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చు.

యాత్రకు ఎంపికయ్యాక ఏం చేయాలి ? 

  • యాత్రకు ఎంపికైన వారు కుమావూ మండల్ వికాస్ నిగమ్ లేదా సిక్కిం టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన నిర్దేశిత బ్యాంకు అకౌంట్‌లో ప్రయాణ ఫీజులను, ఖర్చులను జమ చేయాలి.
  • ఏ బ్యాచ్‌లో యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారో యాత్రికుడు ముందే తెలియజేయాలి.
  • అత్యవసర సమయంలో హెలికాప్టర్‌‌లో తరలింపు కోసం యాత్రికులు అఫిడవిట్‌ను సమర్పించాలి. ఒకవేళ మరణిస్తే చైనా భూభాగంలోనే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అంగీకార పత్రాన్ని ఇవ్వాలి.
  • ఈ డాక్యుమెంట్లలో ఏది లేకపోయినా యాత్రకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వరు.
  • ఈసారి తొలి కైలాస మానస సరోవర యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి లిపులేఖ్ మీదుగా సాగుతుందని వెల్లడించింది.
  • కైలాస మానస సరోవర యాత్రకు  లిపులేఖ్ మార్గంలో వెళ్తే ప్రయాణ ఖర్చు రూ.1.74 లక్షలు ఉంటుంది. అయితే ఈ మార్గంలో యాత్రికులు 200 కిలోమీటర్ల ట్రెక్కింగ్‌ చేయాలి. ఈ మార్గంలో యాత్రను పూర్తి చేసేందుకు 22 రోజులు పడుతుంది.
  • ఒకవేళ నాథులా పాస్‌లో నుంచి యాత్రికులు వెళ్తే ఒక్కొక్కరికి రూ.2.83 లక్షలు ఖర్చవుతుంది. ఈ మార్గంలో యాత్రికులు 36 కి.మీ.లు ట్రెక్కింగ్ చేయాలి. ఈ మార్గంలో 21 రోజుల్లో యాత్ర పూర్తవుతుంది.