Akshaya Tritiya 2026: హిందూ ధర్మంలో అక్షయ తృతీయ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 19, ఆదివారం నాడు వస్తోంది. దీనిని చాలామంది ‘అఖా తీజ్’ అని కూడా పిలుస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టడానికి, లక్ష్మీ దేవికి సంబంధించిన అనుష్ఠానాలు నిర్వహించడానికి ఇది అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన రోజులలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా హిందూ ఇళ్లలో ఈ రోజున లక్ష్మీ పూజను నిర్వహిస్తారు. లక్ష్మీ దేవి అనుగ్రహం ఏడాది పొడవునా ఉండాలని కోరుకుంటూ ఆమెను ఆహ్వానించడానికి ఇంటిని శుభ్రంగా ప్రకాశవంతంగా, అందంగా అలంకరిస్తారు.
అక్షయ తృతీయ 2026కి ముందు ఇంటిని శుభ్రం చేయడం, సర్దుకోవడం అనేది కేవలం పరిశుభ్రత కోసమే కాదు. సానుకూల శక్తిని పెంపొందించడానికి, సంపద, సుఖసంతోషాలను ఆహ్వానించడానికి కూడా చాలా ప్రత్యేకం. శుభ్రంగా క్రమపద్ధతిలో ఉన్న ఇంట్లోనే లక్ష్మీ దేవి నివసిస్తుందని, నిత్య జీవితంలో సామరస్యం ఉంటుందని నమ్ముతారు.
అక్షయ తృతీయ 2026 లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?
ఇల్లంతా శుభ్రం చేయండి
ప్రతి గదిలో ఉన్న విరిగిపోయిన, పాత, పనికిరాని వస్తువులను తొలగించండి. చిరిగిన బట్టలు, గడువు ముగిసిన మందులు, ఖాళీ సీసాలను పారేయండి. తద్వారా మీ ఇల్లు తేలికగా, తాజాగా అనిపిస్తుంది. హిందూ సంప్రదాయం ప్రకారం.. శుభ్రమైన ఇల్లు సానుకూల శక్తి ప్రవాహాన్ని కొనసాగిస్తుంది. లక్ష్మీ దేవి ఇంట్లో కొలువుదీరడానికి మార్గం సుగమం చేస్తుంది.
ఫ్లోర్, ఇంటి మూలలను బాగా శుభ్రం చేయండి
అక్షయ తృతీయ రోజున లేదా అంతకంటే కనీసం ఒక రోజు ముందు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా ఊడ్చి, తడిగుడ్డతో తుడవండి. మూలలు, ఫర్నిచర్ వెనుక భాగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఎందుకంటే దుమ్ము, సాలీడు గూళ్లు సానుకూల శక్తిని అడ్డుకుంటాయని నమ్ముతారు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్వడం మానుకోండి. ఎందుకంటే ఇది ఆర్థిక నష్టానికి దారితీస్తుందని చాలామంది నమ్ముతారు.
Also Read: ఈ స్కూటర్ ధర రూ. 2 లక్షల పై మాటే.. ప్రత్యేకత ఏంటంటే?
తలుపులు, కిటికీలు, అద్దాలను శుభ్రం చేయండి
అక్షయ తృతీయకు ఒక రోజు ముందు ఇంటి కిటికీలు, తలుపులు, అద్దాలను తుడవండి. మెరుస్తూ, దుమ్ము లేకుండా ఉండే గాజు వస్తువులు శుభప్రదంగా పరిగణించబడతాయి. వీటితో పాటు తలుపుల ఫ్రేమ్‌లు, గడపలను కూడా బాగా శుభ్రం చేయండి. తద్వారా ప్రవేశ ద్వారం లక్ష్మీ దేవిని ఆహ్వానించడానికి సిద్ధంగా కనిపిస్తుంది.
పూజా స్థలాన్ని సర్దండి
అక్షయ తృతీయ సందర్భంగా లక్ష్మీ పూజ కోసం ప్రశాంతమైన ప్రదేశానికి ప్రాధాన్యత ఇవ్వండి. పూజా స్థలం మరుగుదొడ్లు లేదా పడకగదికి దూరంగా ఉండేలా చూసుకోండి. పూజా గదిలోని దేవతా విగ్రహాలు, చిత్రపటాలు, పూజా సామాగ్రిని మెత్తని గుడ్డతో శుభ్రం చేసి, క్రమపద్ధతిలో అలంకరించండి. దీనిని కేవలం అక్షయ తృతీయ రోజే కాకుండా సాధారణ రోజుల్లో కూడా పాటించండి.
సహజమైన సుగంధ ద్రవ్యాలను ఉపయోగించండి
ఇల్లు తుడిచే నీటిలో నిమ్మరసం, వెనిగర్ లేదా వేప నీటిని కొన్ని చుక్కలు కలపండి. ఇది మీకు తాజాదనాన్ని ఇవ్వడమే కాకుండా సహజమైన శుభ్రతను కూడా అందిస్తుంది. హాల్, పూజా స్థలంలో అగరుబత్తులు వెలిగించండి లేదా తేలికపాటి సుగంధ నూనెలు లేదా అత్తరును ఉపయోగించండి. ఆహ్లాదకరమైన సువాసన లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకుంటుందని, కుటుంబంలో ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తుందని నమ్ముతారు.
అక్షయ తృతీయ 2026 సందర్భంగా శుభ్రమైన, సువ్యవస్థితమైన ఇల్లు మీ జీవితంలోకి లక్ష్మీ దేవిని ఆహ్వానించడానికి తగిన పునాదిని అందిస్తుంది. ఏప్రిల్ 19కి కొన్ని రోజుల ముందు నుంచే ఈ సరళమైన చిట్కాలను పాటించండి. తద్వారా మీ ఇల్లు శాంతియుతంగా, ప్రకాశవంతంగా, దైవాశీస్సుల కోసం సిద్ధంగా ఉంటుంది.
