Ustaad Bhagat Singh Collections పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బంది పడుతోంది. ఉగాది నాడు ఘనంగా ప్రారంభమైన ఈ చిత్రం, రెండో రోజు వసూళ్లలో భారీ డ్రాప్‌ను చూసింది. తొలి రోజు రూ.34.75 కోట్ల నెట్ వసూలు చేయగా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే సుమారు రూ.140 కోట్ల షేర్ సాధించాల్సి ఉంది. అయితే, శనివారం నుంచి ‘ధురంధర్ 2’ తెలుగు వెర్షన్ విడుదలవుతుండటంతో ‘ఉస్తాద్’ కలెక్షన్లపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఉగాది కానుకగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. పవన్ కళ్యాణ్ మార్క్ మేనరిజమ్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో ‘ఉస్తాద్’ మేనియా కనిపిస్తున్నప్పటికీ, సామాన్య ప్రేక్షకుల నుంచి మాత్రం ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ లభిస్తోంది.
ఈ నేపథ్యంలోనే తొలిరోజు బాక్సాఫీస్ వద్ద గర్జించిన ఈ చిత్రం రెండో రోజు ఊహించని విధంగా డ్రాప్ అయింది. సాక్నిల్క్ వెబ్‌సైట్ నివేదిక ప్రకారం మొదటి రోజు ఇండియాలో రూ.34.75 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా, రెండో రోజు కేవలం రూ.9.25 కోట్లకే పరిమితమైంది. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.59 కోట్ల గ్రాస్ (ఇండియా నెట్ రూ.44 కోట్లు) వసూలు చేసింది. వర్కింగ్ డే కావటం, మిక్స్‌డ్ టాక్ రావటం కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ హిందీ వెర్షన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డు స్థాయి బిజినెస్ చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.137 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుపుకుంది. నైజాంలో రూ.50 కోట్లు, ఆంధ్రాలో రూ.54 కోట్లుగా లెక్కలు ఉన్నాయి. ఈ సినిమా క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే కనీసం రూ.140 కోట్ల షేర్ (సుమారు రూ.225 కోట్ల గ్రాస్) వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ భారీ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగానే కనిపిస్తోంది.
‘ధురంధర్ 2’ దెబ్బ
ఇప్పటికే హిందీ వెర్షన్‌తో ‘ఉస్తాద్’ వసూళ్లకు గండికొట్టిన ‘ధురంధర్ 2’, శనివారం నుంచి తెలుగు వెర్షన్‌లో కూడా గ్రాండ్‌గా విడుదలవుతోంది. దీనికి తోడు అల్లు అర్జున్, రామ్‌చరణ్, మహేశ్‌బాబు, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ ఆ సినిమాను ప్రశంసించడంతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఈ పరిణామం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వీకెండ్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ శని, ఆదివారాల్లో వసూళ్లు పుంజుకుంటేనే ఈ చిత్రం సేఫ్ జోన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది.
