Samantha: సెలైన్‌ స్ట్రిప్‌తో సమంత వర్కౌట్స్.. ‘ఫైటర్’ అంటూ ప్రశంసలు..!

‘యశోద’ మూవీలో సమంత యాక్షన్ సీన్స్‌ అదరగొట్టిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 12:11 PM IST

‘యశోద’ మూవీలో సమంత యాక్షన్ సీన్స్‌ అదరగొట్టిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేందుకు సహకరించిన తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ జునైద్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ పెట్టింది. ‘‘కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో నువ్వు నన్ను గివప్‌ చేయనివ్వలేదు. నీవల్లే ఇలా మారాను. థాంక్యూ’’ అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ను ఆప్యాయంగా హత్తుకున్న ఫొటో‌ను షేర్‌​ చేసింది.

నటి సమంత తన ట్రైనర్‌తో ఉన్న ఫోటోతో పాటు ఓ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ క్లిప్‌లో ఆమె ఒక చేతిలో కాన్యులాతో కఠినమైన వ్యాయామం చేస్తూ కనిపించింది. యశోద విజయాన్ని పురస్కరించుకుని తన శిక్షకుడు తనకు జిలేబీలను ఎలా బహుమతిగా ఇచ్చాడో సమంత తన పోస్ట్‌లో రాసింది. సమంత పోస్ట్ చేసిన ఫొటోలను చూసిన అభిమానులు ‘ఫైటర్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. యశోద మూవీ హిట్ కావడంతో జునైద్ స్వయంగా జిలేబీలు తెచ్చి ఇచ్చినట్లు సమంత వెల్లడించింది. ఈ క్రమంలో ఒక చేతికి సెలైన్‌ స్ట్రిప్‌ ఉన్నప్పటికీ జునైద్ వర్కవుట్ చేయిస్తున్న వీడియోని కూడా ఆమె షేర్ చేసింది.

సమంత నటించిన ‘యశోద’ మూవీ పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. తొలిరోజే రూ.6.32 కోట్ల గ్రాస్‌ సొంతం చేసుకున్న ఈ మూవీ హిట్‌గా నిలవడంతో సమంత ఎమోషనల్ అయిపోయింది. మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతూనే ఈ మూవీలో సమంత స్టన్స్‌ కూడా చేసింది. ప్రస్తుతం గుణశేఖర్, సమంత కాంబినేషన్‌లో శాకుంతలం మూవీ తెరకెక్కుతోంది.