Prakash Raj : దేశ రాజకీయాలు, ప్రస్తుత పరిస్థితులపై బాలీవుడ్ నటీనటులు స్పందించకపోవడంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విస్మయం వ్యక్తం చేశారు. హిందీ సినీ పరిశ్రమలోని సగం మంది ప్రభుత్వానికి అమ్ముడుపోగా, మిగతా సగం మంది భయంలో బతుకులు వెళ్లదీస్తున్నారని ఆయన కామెంట్ చేశారు. అందుకే బాలీవుడ్ నటీనటులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు జంకుతున్నారని ప్రకాశ్ రాజ్ చెప్పారు. ‘‘ప్రభుత్వం ఏదైనా సరే.. చర్చలను అణచివేస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.
Also Read :Hot Bedding : హాట్ బెడ్డింగ్‌తో కాసుల వర్షం.. యువతి వినూత్న వ్యాపారం
తనకు అంత ధైర్యం లేదన్నాడు..
‘‘బాలీవుడ్‌కు చెందిన నా మిత్రుడు ఒకరు మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్ నీకు ధైర్యం ఉంది. నువ్వు మాట్లాడగలుగుతున్నావు. కానీ నాకు అంత ధైర్యం లేదు’’ అని ప్రకాశ్ రాజ్ చెప్పారు. అయితే అతడి పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనన్నారు. ‘‘నేను ఒక విషయమైతే క్లియర్‌గా చెప్పగలను. నేరాలు చేసిన వారిని చరిత్ర వదిలేస్తుందేమో కానీ.. మౌనంగా కూర్చున్నవారిని మాత్రం వదిలిపెట్టదు. ప్రతిఒక్కరూ బాధ్యత వహించాల్సిందే’’ అని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు.
Also Read :Ganja Racket : ఆంధ్రా – ఒడిశా బార్డర్ నుంచి తెలంగాణకు గంజాయి.. గుట్టుగా సప్లై
భవిష్యత్తులోనూ మాట్లాడుతూనే ఉంటా..
దేశ రాజకీయాలపై, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై భవిష్యత్తులోనూ మాట్లాడుతూనే ఉంటానని ప్రకాశ్ రాజ్(Prakash Raj) స్పష్టం చేశారు. ‘‘ఒకవేళ నాతో వర్క్ చేస్తే.. భవిష్యత్తులో సమస్యలు వస్తాయని సినిమా పరిశ్రమ వాళ్లు భయపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకుంటున్నారు’’ అని ఆయన చెప్పారు. ‘‘ఈ కారణాల వల్లే నాకు సినిమా రంగంలో ఛాన్సులు అంతగా రావడం లేదు. ఈ అణచివేతను చూశాకే నేను గళం విప్పాను. నిజం గురించి నిక్కచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టాను. నా గొంతును ఎవరూ నులిమేయలేరు’’ అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. మొత్తం మీద దేశ రాజకీయాలపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో మనసు విప్పి మాట్లాడుతున్నారు.