Rs 78000 Crore Unclaimed: మన దేశంలోని అన్ని బ్యాంకుల్లో ఎన్ని డిపాజిట్లు ఉన్నాయి ? ఈ లెక్క సంగతి వదిలేయండి. బ్యాంకు ఖాతాల్లో ఉన్న తమ డబ్బులను క్లెయిమ్ చేసుకోని ఖాతాదారులు కూడా భారీ సంఖ్యలోనే ఉన్నారట. ఇలా క్లెయిమ్ చేసుకోకుండా కొన్నేళ్లుగా బ్యాంకు ఖాతాల్లోనే మిగిలిపోయిన డబ్బులు ఎన్ని ఉన్నాయో తెలుసా ? రూ.78,213 కోట్లు. ఔను.. ఇది నిజమే. ఇంత భారీ డిపాజిట్లను ఎవరూ వచ్చి తీసుకెళ్లడం లేదట. ఆయా బ్యాంకు ఖాతాలను కలిగిన వారు చనిపోవడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఒకవేళ ఎవరైనా బ్యాంకు ఖాతాదారులు చనిపోయినా.. వారి నామినీలు బ్యాంకుకు వెళ్లి, డెత్ సర్టిఫికెట్‌ను సమర్పించి ఆ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. కనీసం నామినీలైనా వెళ్లి ఆ రూ.78,213 కోట్లను తీసుకోవడం లేదు. దీనికి కారణం.. నామినీల వివరాలను సదరు బ్యాంకు ఖాతాదారులు ఇవ్వకపోవడం. ఒకవేళ నామినీల వివరాలను సమర్పించి ఉంటే, ఇప్పటికే వాటిని క్లెయిమ్ చేసుకొని ఉండేవారు.
ఏమిటీ అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ ?
బ్యాంకుల్లోని సేవింగ్, కరెంట్ ఖాతాల్లో పదేళ్లుగా క్రియారహితంగా ఉన్న సొమ్మును లేదా పదేళ్లు అయినా విత్ డ్రా కాని టర్మ్ డిపాజిట్లను బ్యాంకులు అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లుగా వర్గీకరిస్తాయి.
Also Read :CBI Raids : మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం.. మాజీ సీఎం ఇంట్లో సీబీఐ రైడ్స్
ఏప్రిల్ నెల నుంచి కసరత్తు షురూ
క్లెయిమ్ చేసుకోకుండా ప్రభుత్వరంగ బ్యాంకుల ఖాతాల్లో మూలుగుతున్న డబ్బులలో రూ.45,000 కోట్లను 2019-20 నుంచి 2024-25 మధ్య కాలంలో ఆర్‌బీఐ నిర్వహణలోని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేశారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఖాతాదారులు తమ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకునేందుకు సులభతర విధానాన్ని ఏప్రిల్(Rs 78000 Crore Unclaimed) నెల నుంచి ప్రవేశపెడతామని ప్రకటించింది. దేశంలోని బ్యాంకులన్నీ తమ అధికకారిక వెబ్‌సైట్‌లలో అన్ క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను ఖాతదారుల పేర్లు, పబ్లిక్ సెర్చ్ ఫీచర్‌తో సహా ప్రదర్శించనున్నారు. సదరు బ్యాంకు ఖాతాదారుడు లేదా నామినీ డిపాజిట్‌ను తిరిగి తీసుకునేందుకు డిక్లరేషన్ ఫామ్స్‌ను నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. తమ పేరు, మొబైల్ నంబరు, చిరునామా వంటి వివరాలను అప్లికేషన్‌లో పొందుపర్చాలి.వీటిని బ్యాంకు అధికారులు తనిఖీ చేసి, ఖాతాలో ఉన్న డబ్బును అప్పగిస్తారు. ప్రస్తుతానికి అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను ఆర్‌బీఐకి చెందిన ఉద్గమ్ పోర్టల్‌లో చెక్ చేసుకోవచ్చు. సంబంధిత బ్యాంక్ బ్రాంచీలో సంప్రదించి ఆ సొమ్మును క్లెయిమ్ చేసుకోవచ్చు.