Indian Rupee భారత రూపాయి మారకం విలువ గురువారం భారీగా పుంజుకుంది. గత 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒక్కరోజే పెద్ద మొత్తంలో లాభపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 1.7 శాతం బలపడి 93.25 వద్ద స్థిరపడింది. కరెన్సీ స్పెక్యులేషన్‌ను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకుంటున్న కఠిన చర్యలే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.
మూడు రోజుల సెలవుల తర్వాత మార్కెట్లు తిరిగి ప్రారంభమైన వెంటనే రూపాయి ర్యాలీ కనిపించింది. స్పెక్యులేషన్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆఫ్‌షోర్ డెరివేటివ్ మార్కెట్లపై కూడా ఆర్బీఐ ఆంక్షలను విస్తరించింది. అంతేగాక రెసిడెంట్, నాన్-రెసిడెంట్ క్లయింట్లకు రూపాయి నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (NDF) అందించకుండా బ్యాంకులను నిషేధించింది. రద్దు చేసుకున్న ఫార్వర్డ్ కాంట్రాక్టులను మళ్లీ బుక్ చేసుకునే అవకాశం కంపెనీలకు లేదని స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇవ్వడంతో చాలా ఆసియా కరెన్సీలు బలహీనపడ్డాయి. అయినప్పటికీ రూపాయి బలపడటం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. ఆసియా, దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి.
ఇటీవల బ్యాంకుల నెట్ ఓపెన్ రూపాయి పొజిషన్లపై ఆర్బీఐ 100 మిలియన్ డాలర్ల పరిమితి విధించడం వంటి చర్యలు కూడా రూపాయికి మద్దతుగా నిలిచాయి. స్పెక్యులేటివ్ కదలికలను నిరోధించేందుకు, రూపాయిని స్థిరీకరించేందుకు ఆర్‌బీఐ వద్ద 700 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
