ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతంతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రైతులకు వాతావరణ శాఖ అధికారులు ఊరట కలిగించే వార్త వినిపించారు. ఏపీలో వచ్చే మూడు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, దానికి అనుబంధంగా విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు అంచనా వేశారు. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాలలో తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అంచనా వేశారు. తీరం వెంట గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, మార్కాపురం జిల్లాలలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. సాయంత్రం వేళల్లో పిడుగులు పడొచ్చని.. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్రపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం రోజు పలు జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షం కురిసే సమయంలో పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు.
