Ratan Tatas Will: రతన్ టాటా భౌతికంగా మన మధ్య లేరు. అయితేనేం ఆయన ఆశయాలు ప్రతీ భారతీయుడి మదిలో సజీవంగా ఉన్నాయి. దేశం కోసం ఎలా జీవించాలో రతన్ టాటా మనందరికీ నేర్పి వెళ్లారు. కన్నుమూసే సమయానికి ఆయనకు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తులు ఉండేవి. వీటిలో ఎవరెవరికి ఎంత దక్కాయి ? ఏమేం దక్కాయి ? అనేది తెలియాలంటే రతన్ టాటా 2022 ఫిబ్రవరి 23న రాసిన వీలునామాను చూడాల్సిందే. దీన్ని పరిశీలించి ఆస్తుల కేటాయింపులు చేయాలని ఇప్పటికే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ ప్రక్రియంతా పూర్తయ్యే సరికి మరో ఆరు నెలలు పట్టొచ్చు.
Also Read :Vodafone Idea : వొడాఫోన్ ఐడియాలో కేంద్రానికి 48.99 శాతం వాటా.. ప్రభుత్వ సంస్థగా మారుతుందా?
రూ.3800 కోట్లు ఆ రెండు సంస్థలకే
రతన్ టాటా ఆస్తుల్లో దాదాపు రూ.3800 కోట్లను రతన్ టాటా(Ratan Tatas Will) ఎండోమెంట్ ఫౌండేషన్, ఎండోమెంట్ ట్రస్ట్‌కు కేటాయించారు. ఇలా కేటాయించిన వాటిలో.. టాటా సన్స్‌లో రతన్ టాటాకు ఉన్న షేర్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఈ షేర్లను అమ్మాల్సి వస్తే, టాటా సన్స్‌లోని ప్రస్తుత వాటాదారులకే అమ్మాలని వీలునామాలో రతన్ టాటా రాశారు.
సవతి సోదరీమణులకు రూ.800 కోట్లు
రతన్ టాటా తన సవతి సోదరీమణులు శిరీన్ జజీభోయ్, దియానా జజీభోయ్‌లకు రూ.800 కోట్ల ఆస్తిని రాశారు. ఇందులో ఫిక్స్‌డ్ డిపాజిట్లు, కంపెనీ షేర్లు, ఖరీదైన గడియారాలు, పెయింటింగ్స్ ఉన్నాయి.
మాజీ ఉద్యోగికి రూ.800 కోట్లు
టాటా గ్రూప్ మాజీ ఉద్యోగి, మోహిన్ ఎం దత్తాకు రూ.800 కోట్ల విలువైన ఆస్తులను రతన్ టాటా రాశారు.
జిమ్మీ నావల్ టాటాకు జుహూ బంగ్లా
రతన్ టాటాకు ముంబైలోని జుహూలో బంగ్లా ఉంది. అందులో తన సోదరుడు జిమ్మీ నావల్ టాటాకు వాటాను కేటాయించారు. కొన్ని వెండి వస్తువులు, బంగారు ఆభరణాలను కూడా సోదరుడికి కేటాయించారు.
మెహిల్ మిస్త్రీకి అలీబాగ్ బంగ్లా
తన ప్రియ మిత్రుడు మెహిల్ మిస్త్రీకి అలీబాగ్‌లో ఉన్న బంగ్లా, మూడు తుపాకులను రతన్ టాటా రాసిచ్చారు.
పెంపుడు కుక్కలకు రూ.12 లక్షల ఫండ్
రతన టాటా తన పెంపుడు కుక్కల సంరక్షణ కోసం రూ.12 లక్షలను పక్కనబెట్టారు. ప్రతి నెలా రూ.10వేలను అందుకోసం ఖర్చు పెట్టాలని వీలునామాలో ప్రస్తావించారు.
శంతనుకు ఇచ్చిన లోన్ మాఫీ
తనకు జీవిత చరమాంకంలో అండగా నిలిచిన శంతను నాయుడు చదువుల కోసం రతన్ టాటా ఎంతో సాయం చేశారు. ఆయనకు ఇచ్చిన ఎడ్యుకేషన్ లోన్‌ను మాఫీ చేసినట్లు వీలునామాలో టాటా రాశారు.
పొరుగింటి వారికి ఇచ్చిన లోన్ మాఫీ
తన పొరుగింట్లో ఉండే జేక్ మాలిటే అనే వ్యక్తికి రతన్ టాటా రూ.23లక్షలు అప్పుగా ఇచ్చారు. ఆ అప్పును రద్దు చేస్తున్నట్లు వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు.