One State One RRB : కేంద్ర ఆర్థిక శాఖ కీలకమైన గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మే 1 నుంచి ‘వన్ స్టేట్ వన్ ఆర్‌ఆర్‌బీ’ని అమల్లోకి తెస్తామని ప్రకటించింది. ఆర్‌ఆర్‌బీ అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు. మే 1లోగా ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లోని 15 ఆర్‌ఆర్‌బీల విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని కేంద్ర సర్కారు వెల్లడించింది. ఏపీ విషయానికొస్తే.. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులను కలిపి ఒక ఆర్‌ఆర్‌బీగా చేస్తారు. దీనికి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు అని పేరు పెట్టనున్నారు. దీని ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది. ఈ ఆర్ఆర్‌బీకి స్పాన్సర్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరిస్తుంది.
Also Read :YS Jagans Helicopter: హెలికాప్టర్ డ్యామేజ్.. రోడ్డు మార్గంలో బెంగళూరుకు జగన్.. ఏమైంది ?
మిగిలేది 28 ఆర్ఆర్‌బీలే..
మన దేశంలో ప్రస్తుతం 43 ఆర్‌ఆర్‌బీలు ఉన్నాయి. మే 1 నాటికి 15 ఆర్‌ఆర్‌బీల(One State One RRB) విలీనం తర్వాత.. ఇంకో 28 ఆర్‌ఆర్‌బీలే మిగులుతాయి. తదుపరి విడతల్లో మిగతా వాటిని కూడా విలీనం చేయనున్నారు. సమర్ధమైన నిర్వహణ, వ్యయ హేతుబద్ధీకరణ అనే లక్ష్యాలతోనే ఈ ఆర్‌ఆర్‌బీలను విలీనం చేస్తున్నారు. దేశంలోని ఆర్‌ఆర్‌బీలను ఇప్పటివరకు నాలుగు విడతల్లో విలీనం చేశారు. మే1లోగా విలీనం కానున్న 15 ఆర్ఆర్‌బీలు.. ఏపీ, యూపీ, పశ్చిమ బెంగాల్, బిహార్, గుజరాత్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్నాయి. విలీనం తర్వాత కొత్తగా ఏర్పాటయ్యే ప్రతీ ఆర్‌ఆర్‌బీకి ఆథరైజ్డ్ క్యాపిటల్‌గా రూ.2వేల కోట్లు ఉంటాయి.
Also Read :Patel Vs RSS : ఆర్ఎస్ఎస్‌తో పటేల్‌కు సంబంధమేంటి.. హైజాక్ పాలిటిక్స్‌పై ఖర్గే భగ్గు
ఆర్‌ఆర్‌బీలలో ఎవరికి ఎంత వాటా ?
ఆర్ఆర్‌బీలలో ఎవరికి ఎంత వాటా ఉంటుంది ? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. ప్రతీ ఆర్ఆర్‌బీలలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం వాటా ఉంటుంది. ప్రతీ ఆర్‌ఆర్‌బీ ఒక్కో స్పాన్సర్ బ్యాంకు పరిధిలో పనిచేస్తుంటుంది. అందువల్ల ఆ స్పాన్సర్ బ్యాంకుకు, దాని పరిధిలోని ఆర్‌ఆర్‌బీలో 35 శాతం దాకా వాటాలు ఉంటాయి. ప్రతీ ఆర్‌ఆర్‌బీలు స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి సైతం వాటాలు ఉంటాయి. ఒక్కో ఆర్‌ఆర్‌బీలో రాష్ట్ర ప్రభుత్వానికి సగటున 15 శాతం దాకా వాటాలు ఉంటాయి. విలీనం తర్వాత కూడా ఆర్‌ఆర్‌బీలలో కేంద్ర ప్రభుత్వం, బ్యాంకులు, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త వాటా 51 శాతానికి అస్సలు తగ్గదు.